District Collector A. Suryakumari oversaw the arrangements for the visit of Union Health and Family Welfare Minister Mansukh Mandaviya.
Publish Date : 25/04/2022
కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
సచివాలయాలు, పాఠశాలలు తనిఖీ
విజయనగరం, ఏప్రెల్ 23 ః. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటనా ఏర్పాట్లను, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పర్యవేక్షించారు. ఆమె శనివారం పూసపాటిరేగ, నెల్లిమర్ల, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 26న కేంద్రమంత్రి పాల్గొననున్న కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్ ముందుగా కుమిలిలోని గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది పనితీరును పరిశీలించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. మహిళలకు రక్తపరీక్షలు, పోషకాహార పంపిణీ, ఓటిఎస్, గృహనిర్మాణం తదితర కార్యక్రమాలపై ప్రశ్నించారు. ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం, అక్కడి వసతులపై ఆరా తీశారు. రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి, ఈ క్రాప్ నమోదు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాల వినియోగం తదితర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ కృష్ణమూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లిమర్ల మండలం జరజాపుపేటలో కలెక్టర్ పర్యటించారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, ఆహార పదార్ధాల నాణ్యత, గుడ్ల పరిమాణంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రాజేష్‌ను ప్రశ్నించారు. అనంతరం సమీపంలోని మొండివీధి ప్రాధమిక పాఠశాలను సందర్శించారు. మూడోతరగతి విద్యార్థులతో ముచ్చటించి, వారి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. పాఠశాలలో పూర్తయిన నాడూ-నేడు మొదటిదశ పనులను పరిశీలించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ సముద్రాల రామారావు, సిపిఐ నాయకులు తాలాడ సన్నిబాబు తదితరులు, గ్రామంలోని సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ రమణరాజు, ఆయా పాఠశాలల హెడ్‌మాష్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బొండపల్లి మండలం గొట్లాంలోని జిల్లాపరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. ఆర్ఓ ప్లాంటు పనిచేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులపై ఆరా తీశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, దానిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ పర్యటనలో సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వామినాయుడు, తాశీల్దార్ మిశ్రా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
