District Collector A. Suryakumari said that the district will be the first place in higher education admissions, check that dropouts do not happen, form a committee to control fees.
Publish Date : 22/07/2022
ఉన్నత విద్య ప్రవేశాల్లో జిల్లాకు ప్రధమస్థానం
డ్రాపౌట్స్ జరగకుండా చూడండి
ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, జులై 22 ః ఉన్నత విద్యాప్రవేశాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు. పదోతరగతి తరువాత ఇంటర్, ప్రొఫెషనల్, డిగ్రీ తదితర కోర్సుల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే, మన జిల్లాలోనే ఎక్కువ శాతం ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిని నిలబెట్టుకోవాలని, ఏ స్థాయిలో కూడా డ్రాపౌట్స్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల విద్యాసంస్థలు, సంక్షేమ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రవేశాలపై, తన ఛాంబర్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయా విద్యాసంస్థల వారీగా, తరగతులవారీగా ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ తరగతిలో కూడా డ్రాపౌట్స్ లేకుండా చూడాలన్నారు. ఒకవేళ ఇప్పటివరకు ఎక్కడైనా పై తరగతిలో ప్రవేశం జరగని పక్షంలో, దానికి కారణాన్ని తెలుసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే సచివాలయ సిబ్బందిని దీనికి వినియోగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు డిఆర్ఓ, డిఇఓ, సమగ్రశిక్ష ఎపిసిలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎక్కడైనా ఫీజులను అధికంగా వసూలు చేస్తే, ఈ కమిటీ సభ్యులతోపాటు కంట్రోల్ రూము నెంబరు 9505167382 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంటర్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
అజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రతీ విద్యాసంస్థలో జాతీయ జెండాను ఎగురవేయాలని, దీనికోసం అవకాశం ఉన్నచోట శాశ్వతంగా ఒక జెండా స్థూపాన్ని నిర్మించాలని చెప్పారు. అలాగే శాశ్వతంగా నిలిచే విధంగా ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని, దానిపై సంతకాలను లేదా చేతి ముద్రలను వేయించాలని సూచించారు. ప్రతీ విద్యాసంస్థలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసి, విద్యార్థులు, తల్లితండ్రులచేత సెల్ఫీలను తీయించి తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతీ విద్యాసంస్థలో వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, మోనో యాక్షన్, ఫ్యాన్సీడ్రెస్ తదితర పోటీలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఇఓ డాక్టర్ ఎఎం రాజేశ్వరి, సమగ్రశిక్ష ఎపిసి డాక్టర్ స్వామినాయుడు, ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ, డివిఇఓ సురేష్ కుమార్, సిపిఓ మురళి, సోషల్ వెల్ఫేర్ డిడి రత్నం, డిబిసిడబ్లూఓ డి.కీర్తి, గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారి చంద్రావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
