District Collector A. Suryakumari said that the teaching profession is the most sacred. He said that apart from shaping the future of children, teachers have a great task of making them useful to the society.
Publish Date : 07/09/2022
గురువులపై గురుతర బాధ్యత
ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన సర్వేపల్లి
ఎంపి బెల్లాన చంద్రశేఖర్
ఘనంగా 60వ గురుపూజోత్సవం
విజయనగరం, సెప్టెంబరు 05 ః సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని, విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని కొనియాడారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, 60 వసంతాల గురు పూజోత్సవం, జెడ్‌పి సమావేశమందిరంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను, చిట్టిగురువులను ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహూకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, తల్లితండ్రుల తరువాత స్థానం గురువుదేనని స్పష్టం చేశారు. సమాజాన్ని నడిపించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. వారు అంకితభావంతో పనిచేయకపోతే, వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తన అసమాన ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని కొనియాడారు. రాష్ట్రప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఫలాలు అట్టడుగు వర్గాలకు సైతం సక్రమంగా అందుతున్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యావ్యస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పోటీపడుతుండటంతో, ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా, వారిని సమాజానికి ఉపయోగపడేలా రూపొందించే గొప్ప కార్యం ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. అయితే కొన్ని మాథ్యమాల్లో ఉపాధ్యాయులను జోకర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థీ తన తల్లితండ్రుల పట్లా, గురువు పట్లా ఎల్లప్పుడూ విధేయత కలిగిఉండాలని అన్నారు. విద్యార్థులు విద్య ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. పదోతరగతి పూర్తి అయ్యేటప్పటికే, వారికి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యాభివృద్ది కోసం జిల్లాకు ఇటీవల కాలంలో అత్యధిక కేటాయింపులు వస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు, చిట్టిగురువులు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని అన్నారు.
ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ, దేశానికి దశ, దిశ నిర్ణయించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఉపాద్యాయులు కూడా క్రమశిక్షణ పాటిస్తూ, విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాలని కోరారు. చదువు ద్వారానే అభివృద్ది సాధ్యమని స్పష్టం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, తాను చేపట్టిన ప్రతీ పదవికీ వన్నె తెచ్చారని కొనియాడారు. రాష్ట్రప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఈ మూడేళ్లలో రికార్డు స్థాయిలో రూ.52వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
ఎంఎల్‌సి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ, భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ఉపాధ్యాయులు తమ పిల్లల బాధ్యత కంటే, తమదగ్గర చదువుకోవడానికి వచ్చే పిల్లలపైనే ఎక్కువ శ్రద్ద పెడతారని చెప్పారు. ఉపాధ్యాయులు సమాజానికి శిల్పులు లాంటివారని కొనియాడారు.
గజపతినగరం ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అందుకే మన పెద్దలు గురువుని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో పోల్చారని చెప్పారు. దేశ భవిష్యత్తు, సమాజాన్ని తీర్చిదిద్దే గొప్ప అవకాశం వారి చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు లాంటివని అన్నారు. ఈ రెండూ సమాజానికి చాలా కీలకమని, అందుకే వీటికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. విద్య అన్నది భవిష్యత్తుకు పెట్టుబడి అన్నది జగన్‌మోహనరెడ్డి ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎ.మణి, సిహెచ్.రాధాకృష్ణ, బి.సోమరాజు, చిట్టిగురువులు కె.జగదీష్, జ్యోతి మాట్లాడుతూ, తమ అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి డిఇఓ కె.వెంకటేశ్వర్రావు, సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, వయోజన విద్య డిడి కోట్ల సుగుణాకరరావు, జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌టి తిరుపతినాయుడు, ఎపిఆర్ఎస్ డబ్ల్యూ సొసైటీ సమన్వయకర్త చంద్రావతి, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది.
………………………………………………………………………….
సన్మానం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులు వీరే ః
హెడ్మాష్టర్లు ః సిహెచ్ రాధాకృష్ణ, సిహెచ్ వెంకటరమణ
లెక్చర్లు ః డి.అప్పలనాయుడు
స్కూల్ అసిస్టెంట్లు ః టి.శశికుమారి, టి.రాజేష్, వి.ఈశ్వర సత్యనారాయణ, బి.సోమరాజు, డిఏవి ఉమామహేష్, పి.సత్యప్రకాష్, వి.రవికుమార్, అబ్దుల్ రహమానా, జి.రామకృష్ణ.
హెడ్‌మాష్టర్లు (యుపి స్కూల్) ః ఏ.గోవిందరావు
స్కూల్ అసిస్టెంట్లు (యుపి స్కూల్) ః ఎస్.ఉమామహేశ్వర్రావు, యు.పద్మ
ఎస్‌జిటిలు ః ఎ.మణి, జి.సూరిబాబు, పి.ఈశ్వర్రావు, ఆర్.అప్పలనాయుడు, ఎం.సత్యంనాయుడు, పి.రామకృష్ణ.
ఎస్ఏపిఇ లుః ఎస్.సూర్యారావు, వి.సత్యానంద్, కె.లక్ష్మణ, ఆర్.వాణిశ్రీ.
విశ్రాంత ఉపాధ్యాయులు ః ఎన్.రేవతి.
ఎపిఎంఎస్ ః ఆర్.ఈశ్వర్రావు
ఎపిఆర్ఎస్‌డబ్ల్యూ ః డాక్టర్ కె.రఘునంద్
ఎపిఎస్‌డబ్ల్యూఆర్ఐ ః ఐ.సీతమ్మ
కెజిబివిలు ః ఇ.స్వప్న, వై.వరలక్ష్మి, ఎస్.మాధవి, ఆర్.వాణి, ఆర్.సత్యవతి.
ట్రైబల్ వెల్ఫేర్ ః బి.శ్రీనివాసరావు, జెఎస్ సాయికుమారి.
మున్సిపల్ పాఠశాలలు ః సిహెచ్ సింహాచలం, జికె కృష్ణమూర్తి.
ఎంజెపిఏపిబిసిడబ్ల్యూఆర్ ః సిహెచ్. రామమోహని.
సన్మానం పొందిన చిట్టిగురువులు ః ఎస్.గణేష్, జెడ్‌పిహెచ్ఎస్, కొండకరకాం, జి.యశ్వంత్, జెడ్‌పిహెచ్ఎస్, కొండగంగుబూడి, కె.అంజలి, జెడ్‌పిహెచ్ఎస్, డెంకాడ, కె.జ్యోతి, జెడ్‌పిహెచ్ఎస్, బాడంగి, వి.శిరీష, జెడ్‌పిహెచ్ఎస్, కంచరాం, కె.జగదీష్, ఎంపియుపి పాఠశాల, జక్కువ, కె.భగవతి, జెడ్‌పిహెచ్ఎస్, భైరిపురం, శశాంక్, జెడ్‌పిహెచ్ఎస్, లింగరాజపురం.
