Close

District Collector Smt. A. Suryakumari directed to immediately start employment in all the villages in the district and complete it by the end of March.

Publish Date : 22/12/2021

ఉపాధి ప‌నులు చేప‌ట్టి మార్చిలోగా పూర్తిచేయాలి

ప‌నులు చేప‌ట్టేందుకు నిధుల స‌మ‌స్య వుండ‌దు

గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై గ్రామీణుల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి

అంగ‌న్‌వాడీల్లో పిల్ల‌ల బ‌రువుపై త‌నిఖీలు చేయాలి

స‌చివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్యకుమారి ఆదేశాలు

ఎస్‌.కోట‌, గంట్యాడ మండ‌లాల్లో స‌చివాల‌యాలు, ఆర్బీకె త‌నిఖీలు

ఎస్‌.కోట‌లో సినీ థియేట‌ర్ తనిఖీ

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 21 : జిల్లాలో ఉపాధి ప‌నులు అన్ని గ్రామాల్లో త‌క్ష‌ణ‌మే చేప‌ట్టి మార్చి నెలాఖ‌రులోగా పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. గ్రామాల్లో పాఠ‌శాల‌ల‌కు అవ‌స‌ర‌మైన ఆట‌స్థ‌లాలు, ర‌న్నింగ్‌ట్రాక్‌లు, ప్ర‌హారీగోడ‌లు వంటి ప‌నుల‌ను త‌క్ష‌ణం చేప‌ట్టి మార్చి నెలాఖ‌రులోగా వేగ‌వంతంగా పూర్తిచేయాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు నిధుల స‌మ‌స్యే వుండ‌ద‌ని, ప‌నులు పూర్త‌య్యేలోగానే నిధుల విడుద‌ల వుంటుంద‌ని పేర్కొన్నారు. ఎస్‌.కోట, గంట్యాడ మండ‌లాల్లో క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. ప‌లు గ్రామ స‌చివాల‌యాలు, రైతుభ‌రోసా కేంద్రాలు, సినీ థియేట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. ముందుగా ఎస్‌.కోట మండ‌లం ధ‌ర్మ‌వ‌రంలో గ్రామ స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసి స‌చివాల‌య సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. గ్రామంలో వివిధ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ప్ర‌జా  విన‌తుల ప‌రిష్కారంపై ఆరా తీశారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న తీరును తెలుసుకున్నారు. స‌చివాల‌య సిబ్బంది కొంద‌రు మాస్క్‌లు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ కోవిడ్ నిబంధ‌న‌లు తాము పాటించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిలో అవ‌గాహ‌న క‌లిగించాల‌న్నారు. గ్రామంలో ఉపాధిహామీ నిధుల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్‌, స‌చివాల‌య కార్య‌ద‌ర్శిని అడిగి తెలుసుకున్నారు.
స‌చివాల‌య ప‌రిధిలోని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను త‌నిఖీచేసి పిల్ల‌ల బ‌రువు స‌క్ర‌మంగా తూకం వేస్తున్న‌దీ లేనిదీ త‌నిఖీలు చేస్తుండాల‌ని మ‌హిళా పోలీసుకు సూచించారు. గ్రామంలో మ‌హిళ‌ల‌పై నేరాల‌కు సంబంధించి ఎలాంటి కేసులు న‌మోదు అయ్యిందీ లేనిదీ తెలుసుకున్నారు. రేష‌న్ పంపిణీ, ఎం.డి.యు.ల ద్వారా ఇంటింటికీ రేష‌న్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న తీరుపై ఆరా తీశారు. గ్రామంలో పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్రమంలో ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇళ్లు నిర్మాణం చేప‌ట్టిన వారికి డ‌బ్బులు వారి ఖాతాల‌లో జ‌మ అయ్యిందీ లేనిదీ తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, ఇసుక కొర‌త ఏమైనా వున్న‌దీ తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం వేగ‌వంతంగా జ‌రిగేలా ల‌బ్దిదారుల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు.

ఎస్‌.కోట‌లో సినిమా థియేట‌ర్ త‌నిఖీ

      ఎస్‌.కోట‌లో శ్రీ‌నివాస మ‌హ‌ల్ థియేట‌ర్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీ శంక‌ర్‌తో క‌ల‌సి థియేట‌ర్‌ను సంద‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ థియేట‌ర్‌లో రోజుకు ఎన్ని షోలు వేస్తున్నారు, టిక్కెట్ ధ‌ర‌లు ఏవిధంగా వ‌సూలు చేస్తున్నారు, టిక్కెట్ల విక్ర‌యానికి ఎలాంటి విధానాలు అనుస‌రిస్తున్నదీ థియేట‌ర్ య‌జ‌మానితో మాట్లాడి తెలుసుకున్నారు. థియేట‌ర్ సామ‌ర్ధ్యం 525 వున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం మేట్నీ షోలో కేవ‌లం 25 మంది ప్రేక్ష‌కులే వున్న‌ట్టు య‌జ‌మాని తెలుప‌డంతో థియేట‌ర్‌లోకి వెళ్లి క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. టిక్కెట్లు అడ్వాన్సు బుకింగ్ ఇవ్వ‌డం లేద‌ని, ఆన్ లైన్‌లో కూడా టిక్కెట్ల విక్ర‌యాలు జ‌ర‌గ‌డం లేద‌ని క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. ప్ర‌స్తుతం రూ.100, 70, 50 ధ‌ర‌ల‌కు టిక్కెట్లు మూడు కేట‌గిరీలుగా విక్ర‌యిస్తున్న‌ట్టు తెలిపారు. రోజుకు నాలుగు షోల‌కు మించి వేయ‌రాద‌ని, ఏ షోకు సంబంధించిన టిక్కెట్లు ఆ షోలోనే విక్ర‌యించాల‌ని, టిక్కెట్ల ధ‌ర‌లు పెంచి విక్ర‌యించ‌రాద‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
గంట్యాడ‌లో స‌చివాల‌యం, ఆర్బీకె త‌నిఖీ

     గంట్యాడ మండ‌లంలో క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. వ‌సాది గ్రామంలో స‌చివాల‌యాన్ని, రైతు భ‌రోసా కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. నిర్మాణంలో వున్న స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప‌రిశీలించి పూర్తి కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై స‌చివాల‌య సిబ్బందిని ప్ర‌శ్నించారు. స‌చివాల‌య నూత‌న భ‌వ‌నం నాణ్య‌త లేక‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఉపాధి ప‌నుల‌పై ఆరా తీశారు. 26 ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించిన‌ట్లు స‌చివాల‌య సిబ్బంది వివ‌రించారు. ఈ పనుల‌ను మార్చిలోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగంపై గ్రామ స‌చివాల‌యానికి వ‌చ్చిన కొంద‌రు గ్రామ మ‌హిళ‌ల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ బియ్యంపై కొంద‌రు అపోహ‌లు సృష్టించార‌ని, అందువ‌ల్ల గ్రామంలో ఎవ‌రూ ఈ బియ్యం వినియోగించేందుకు ముందుకు రావ‌డం లేద‌ని మ‌హిళ‌లు చెప్ప‌డంతో క‌లెక్ట‌ర్ వారికి ఈ బియ్యం ఎంత విలువైన‌వో వివ‌రించి చెప్పారు. మహిళ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా మ‌న జిల్లాకు మాత్ర‌మే ఈ బియ్యం కోటా ఇస్తోంద‌ని, మ‌హిళ‌లంతా అపోహలు వీడి ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగించి త‌మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చుకోవాల‌న్నారు. ఇళ్ల‌నిర్మాణం వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

    వ‌సాది ఆర్బీకెని త‌నిఖీచేసి ఈ-క్రాప్ వివ‌రాల న‌మోదుపై క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. ధాన్యం కొనుగోలుకు చేస్తున్న ఏర్పాట్ల‌పై తెలుసుకున్నారు.

District Collector Smt. A. Suryakumari directed to immediately start employment in all the villages in the district and complete it by the end of March.