Close

District Collector Suryakumari directs to provide better service to the people in the ward

Publish Date : 24/02/2022

వార్డులోని ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లందించాలి

వార్డును ప‌రిశుభ్రంగా వుంచాలి

స‌చివాల‌యం సంద‌ర్శించే వారితో గౌర‌వంతో వ్య‌వ‌హ‌రించాలి

సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆదేశాలు

53వ వార్డు స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌

విజ‌య‌న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 23 :స‌చివాల‌యం ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందించేందుకు సిబ్బంది, వ‌లంటీర్లు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. వార్డు ప‌రిధిలో ప్ర‌భుత్వ సేవ‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి త్వ‌రితంగా సేవ‌లందించాల‌న్నారు. ప్ర‌భుత్వ సేవ‌లు సుల‌భ‌త‌రంగా అందించే దిశ‌గా సిబ్బంది ప‌నిచేయాల‌న్నారు. న‌గ‌రంలోని అయ్య‌న్న‌పేట‌ 53వ వార్డు స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించి స‌చివాల‌యం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. వార్డులో చేప‌డుతున్న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల గురించి తెలుసుకున్నారు. స్పంద‌న విన‌తుల ప‌రిష్కారంపై ఆరా తీయ‌గా ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు, విన‌తులు రాలేద‌ని సిబ్బంది స‌మాధాన మిచ్చారు. స‌చివాల‌యానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించి వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విని త‌మ ప‌రిధిలో వుంటే త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని, లేనిప‌క్షంలో పై అధికారుల‌కు నివేదించి త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. స‌చివాల‌యంలో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ మిన‌హా అన్ని ర‌కాల సాంకేతిక ప‌రికరాలు అందుబాటులో వున్న‌ట్టు సిబ్బంది క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. స‌చివాల‌యంలో ఒక్క‌రు మాత్ర‌మే యూనిఫాం ధ‌రించ‌డంతో మిగిలిన వారి గురించి క‌లెక్ట‌ర్ వాక‌బు చేశారు. ఇంకా సిద్ధం కాలేద‌ని త‌మ‌కు యూనిఫాం స‌ర‌ఫ‌రా చేయలేద‌ని క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

      ఇటీవ‌ల స‌చివాల‌య సిబ్బందికి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఇచ్చిన శిక్ష‌ణ ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌క‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌శ్నించారు. అందులో ఏం నేర్చుకున్నార‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌శ్నించారు. శిక్ష‌ణ‌లో నేర్చుకున్న అంశాల‌ను మిగిలిన సిబ్బందికి తెలియజేయ‌డంతోపాటు వాటిని పూర్తిస్థాయిలో ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ఫ‌లితాలు సాధించాల‌న్నారు.

District Collector Suryakumari directs to provide better service to the people in the ward