District Revenue Officer M. Ganapathirao stated that apart from money and property, moral values should be given as inheritance to the future generations and they should be informed about the life characteristics of freedom fighters.
Publish Date : 10/08/2022
*భావితరాలకు నైతిక విలువలను వారసత్వంగా అందించాలి*
*జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు
*స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఆత్మీయ సత్కారం
విజయనగరం, ఆగస్టు 09 ః భావితరాలకు డబ్బు, ఆస్తులు కాకుండా నైతిక విలువలను వారసత్వంగా అందించాలని, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను వారికి తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు పేర్కొన్నారు. నేటి తరం యువతకు చరిత్ర గురించి తెలియజేస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపాలని సూచించారు. మానసిక పరివర్తన పెంపొందేలా, సామాజిక అంశాలపై అవగాహన కలిగేలా యువతను పుస్తక పఠనం వైపు మళ్లించాలని హితవు పలికారు. నైతిక విలువలతో కూడిన సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాలులో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు, కుటంబీకులకు మంగళవారం ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్వో మాట్లాడారు. జిల్లా నుంచి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, ధైర్య సాహసాలను ప్రదర్శించిన సమరయోధుల జీవిత విశేషాల గురించి నేటి తరం యువతకు తప్పకుండా తెలియజేయాలని సూచించారు. నాటి తరం వారు విలువలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారని అందుకే వారిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా విలువలు పాటిస్తూ ముందుకెళ్లాలని అప్పుడే వారి ఆశయాలను నెరవేర్చిన వారమవుతామని పేర్కొన్నారు. మనందరం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సమరయోధులు చేసిన త్యాగాలే అని పేర్కొన్నారు. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలను మననం చేసుకుంటూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లా నుంచి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని పోరాట పటిమ చూపిన మహనీయుల జీవితాలు మనందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
*వారసులకు ఆత్మీయ సత్కారం*
వేదుల సునీల్ (కందాళ సుబ్రహ్మణ్య తిలక్ మనవడు), పూసపాటి సుజాత(పాకలపాటి వెంకట నరసింహరాజు మనవరాలు), ఆదిరాజు దేవకీనందరావు(తాట దేవకీనందరావు మనవడు), బొత్స వెంకట ప్రసాద్(బొత్స ఆదినారాయణ కుమారుడు) , పసుమర్తి వెంకట గణేష్ (పసుమర్తి వీరభద్ర స్వామి మనవడు), పూసపాటి అప్పల నరసింహరాజు (పూసపాటి లక్ష్మీనరసింహరాజు మనవడు), కడిమిశెట్టి కృష్ణమూర్తి (కడిమిశెట్టి రామమూర్తి మనవడు), పూసపాటి వెంకట నారాయణరాజు (పూసపాటి బుచ్చి సీతారామ చంద్రరాజు మనవడు), అమ్ము రవి శంకర్ (ఆదిరాజు జగన్నాథ శర్మ మనవడు), గేదెల వెంకట ఈశ్వరి(గొరిపాటి బుచ్చి అప్పారావు మనవరాలు)లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి అధికారులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.
డీఆర్వో గణపతిరావు, జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య, సీపీవో బాలాజీ, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, డీఐపీఆర్వో రమేశ్, అగ్నిమాపక అధికారి వినయ్, డీఎస్‌డీవో అప్పలనాయుడు తదితర జిల్లా అధికారులు స్వాతంత్య్ర సమరయోధుల వారసులను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారసులందరూ వారి అనుభవాలను, మధుర స్మృతులను పంచుకున్నారు.
