Do not step on – Do not spoil lives, Collector Surya Kumari at an awareness seminar on child marriages and social issues
Publish Date : 21/04/2022
👉తప్పటడుగులు వేయవద్దు- జీవితాలు పాడు చేసుకోవద్దు
👉బాల్య వివాహాలు, సామాజిక సమస్యల పై అవగాహనా సదస్సు లో కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, ఏప్రిల్ 20:: బాలికలు కౌమార దశ నుండి యవ్వనం లోకి అడుగుపెడుతున్న తరుణం లో తొందరపడి తప్పటడుగులు వేసి జీవితాలను పాడు చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి హితవు పలికారు. ఈ వయసు లో ఒక సారి తప్పు జరిగితే సరిదిద్దుకోలేరని, అందువల్ల జీవితాలు పాడవుతాయని అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా జాగృతి యాత్ర కార్యక్రమం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధిని లకు బాల్య వివాహాలు, గుడ్ టచ్, బాడ్ టచ్, ఆరోగ్య సమస్యలు తదితర అంశాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్ చదువుతున్న అమ్మాయిలంతా తప్పకుండా డిగ్రీ పూర్తి చేయాలన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సు లే కాకుండా సోషల్ డిగ్రీ లు కూడా మంచివేనని అన్నారు. ఏ కోర్స్ చదువుతున్నాం అనేది ముఖ్యం కాదని ఎంత క్రమశిక్షణ తో చదివాము, ఏ రాంక్ సాధించాం అన్నదే ముఖ్యమని తెలిపారు. చదువుకుంటున్న వారికి కళ్ళ ముందు కెరీరే కనపడాలని అన్నారు. చదువుకుంటూ ఖాళీ దొరికినప్పుడు చిట్టి గురువులుగా మరి కొంత మందికి విద్యను నేర్పించాలని, తద్వారా సబ్జెక్ట్ మరిచిపోకుండా ఉంటారని, గౌరవం తో పాటు సంతృప్తి లభిస్తుందని అన్నారు. వేసవి లో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, యోగ వంటి కోర్సు లలో చేరి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మేయర్ వెంపడాపు విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, విద్య కానుక, వసతి దీవెన వంటి చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తుందని, బాలికలంతా చక్కగా చదువుకొని మంచి స్థాయి లో స్థిరపడాలని అన్నారు. ఉప మేయర్లు కోలగట్ల శ్రావణి, ఈసపు రేవతి దేవి బాలికల కెరీర్ కి సంబంధించి పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ఐ.సి.డి.ఎస్ పి.డి శాంత కుమారి సభాధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శిశు అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ డా.హిమబిందు మాట్లాడుతూ తల్లిదండ్రుల, కుటుంభ సభ్యుల ప్రేమలు కరవైతే పిల్లల ప్రవర్తన విపరీతంగా ఉంటుందని అన్నారు. తల్లి దండ్రుల అదుపులో ఉంటూ, జీవితంలో ముందు స్థిరపడితేనే సమాజం లో గౌరవం వస్తుందని తెలుసుకోవాలన్నారు. సెల్ ఫోన్ మానవ బాంబ్ లా మారిందని, అనేక జీవితాలు కష్టాల్లో పడిపోడానికి కారణం అవుతోందని, దీనిని ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిదని అన్నారు.
మెడికల్ ఆఫీసర్ డా.శిరీష మాట్లాడుతూ బాల్య వివాహాలు, మెన్స్ట్రుల్ సమస్యలు, రక్త హీనత, తదితర అంశాలపై అవగాహన కలిగించారు. డి.ఎల్.ఎస్.ఏ అడ్వకేట్, దిశ ఎస్.ఐ లక్ష్మీ, బాల్య వివాహాలు చట్టం, శిక్షలు తదితర అంశాల పై వివరించారు.
👉ఆకట్టుకున్న పోషకాహార ప్రదర్శన ::
ఈ సందర్బంగా గంట్యాడ సి.డి.పి.ఓ ప్రసన్న అద్వర్యం లో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన విజ్ఞానదాయకంగా నిలిచింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందడం ఎలా అనే అంశాలను ప్రదర్శించారు. ముఖ్యముగా రాగి, జొన్న పిండి, బలామృతంలతో తయారు చేసిన వంటకాలు, కారట్, బీట్ రూట్, బొప్పాయి లతో చేసిన హల్వాలు రుచికరంగా ఉన్నాయి. ఈ వంటకాలను కలెక్టర్ తదితరులు రుచి చూసారు. సూపర్వైజర్ విజయ పోషకాహారం పై సమగ్రంగా వివరించారు. ఈ సందర్బంగా వేసిన ర0గోలి లో ఆజాది క అమ్రిత్ లోగో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. వారిని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు, 300 పై బడి ఇంటర్ విద్యార్థినులు పాల్గొన్నారు.
