Efforts should be made to achieve the objectives. Ranks should be further improved. Collector Suryakumari at the Nithi Ayog meeting
Publish Date : 06/11/2021
లక్ష్య సాధనకు కృషి చేయాలి
ర్యాంకులను మరింత మెరుగు పర్చాలి
నీతి అయోగ్ సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 06 ః
నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నీతి అయోగ్ అంశాల్లో భాగమైన వ్యవసాయం, నీటి వనరులు వినియోగం, ఉద్యానపంటల విస్తరణ, సూక్ష్మ నీటి పారుదల తదితర కార్యక్రమాలపై తన ఛాంబర్‌లో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆయా శాఖల వారీగా నీతి అయోగ్ ర్యాంకులను, ఇండికేటర్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ శాఖా నీతి అయోగ్ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. రబీలో పంటల సాగు పెరిగేలా చూడాలని, చిన్న, సన్నకార రైతులకు విరివిగా రుణాలను అందజేయాలని సూచించారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. భూసార పరీక్షలను విరివిగా నిర్వహించి, సర్టిఫికేట్లను రైతులకు అందజేయాలని, భూ సారాన్ని బట్టి పంటలను సూచించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. ప్రజలు కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకోసం ఎదురు చూడకుండా, బ్యాంకు రుణాలను తీసుకొని అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేలా చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, తుంపర సేద్యం అమలుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆసక్తి ఉన్న రైతులకు అవగాహన కల్పించి, ఈ విధానాన్ని అవలంబించేలా చూడాలన్నారు. వారికి పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించాలని ఎపిఎంఐపిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జెడి వి.టి.రామారావు, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, ఎపిఎంఐపి పిడి పాండురంగారావు, ఎల్‌డిఎం ఎం.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
