Eliminate neglected volunteers, focus on grain procurement, Covid Third Dose from 10, Collector Suryakumari at the Special Officers’ Meeting
Publish Date : 04/01/2022
నిర్లక్ష్యంగా ఉన్న వలంటీర్లను తొలగించాలి
ధాన్యం సేకరణపై దృష్టి సారించండి
10 నుంచి కోవిడ్ థర్డ్ డోస్
ప్రత్యేకాధికారుల సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జనవరి 03 ః ప్రజలకు సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు., ఇటీవల కాలంలో వలంటీర్లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అటువంటివారి స్థానంలో కొత్తవారిని నియిమించాలని సూచించారు. వివిధ మండలాల ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, కోవిడ్ వేక్సినేషన్, ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులు, హౌసింగ్ కాలనీల నిర్మాణం, ఓటిఎస్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది సేవలు ఇటీవల కాలంలో మెరుగుపడినప్పటికీ, వలంటీర్ల సేవలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అటువంటివారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు మండలాల్లో పర్యటించే సమయంలో ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించాలన్నారు. ఈ నెల 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటినవారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్‌కేర్ వర్కర్లకు కోవిడ్ మూడో డోసును వేయడం జరుగుతుందన్నారు. 15 ఏళ్లు నుంచి 18 వరకు ఉన్నవారికి వేక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యిందని, దీనిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్సెషల్ ఆఫీసర్లు వేక్సినేషన్‌ను పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం నిర్మాణాలకు అనుకూల సమయమని, వారం రోజుల్లోగా అన్నిరకాల కన్వర్జెన్సీ పనులనూ ప్రారంభించాలని, నిర్మాణంలో ఉన్నవాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక, సిమ్మెంటు ఇతర నిర్మాణ సామగ్రికి కొరత లేదని స్పష్టం చేశారు. భూసమస్యలు ఏమైనా ఉంటే, సంబంధిత తాశీల్దార్‌తో మాట్లాడి, వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సమీక్షిస్తూ, ఈ పథకం అమలును వేగవంతం చేయాలన్నారు. చెత్తశుద్ది కేంద్రాల నిర్వహణపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలను వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. జగనన్న కాలనీలపై సమీక్షిస్తూ, అన్ని లేఅవుట్లకు రోడ్లు, విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్దిదారుల స్థానంలో కొత్తవారికి ఆ స్థలాలను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.
మండలాల్లో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూములు
కోవిడ్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా మండలాల్లో కమాండ్ కంట్రోలు రూములను ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ చెప్పారు. దీనికి అవసరమైన కంప్యూటర్లు, సిసి కెమేరాలు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి తదితర సౌకర్యాలు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించి, నివేదికలను సమర్పించాలని సూచించారు. సచివాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కొనడానికి మండలస్థాయి అధికారులు సిద్దంగా ఉండాలని జెసి కోరారు. సమన్వయంతో కోవిడ్ వేక్సినేషన్‌ను పూర్తిచేయాలని సూచించారు. ఇటీవల ఏర్పడిన కొత్త గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు వచ్చాయని వెళ్లడించారు.
ఈ నెలాఖరునాటికి శతశాతం ఇళ్లనిర్మాణం ప్రారంభం కావాలి
జనవరి నెలాఖరునాటికి ఇళ్లనిర్మాణం శతశాతం జరగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ కోరారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎంతో అనుకూలమైన సమయమని, సిమెంటు, ఇసుక, ఇతర సామగ్రి సిద్దంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు నిర్మించిన జగనన్న ఇళ్లకు దాదాపు 95శాతం బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అదనంగా నిధులను కేటాయించడం వల్ల మరో రెండుమూడు నెలలపాటు బిల్లులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. మార్చినాటికి 50శాతం, జూన్ నాటికి శతశాతం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సొంతస్థలాల్లో ఇళ్లను మంజూరు చేసిన లబ్దిదారులను గుర్తించి, వారందరిచేతా తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రాంరంభింపజేయాలన్నారు. గృహనిర్మాణ లబ్దిదారులైన డ్వాక్రా మహిళలకు అవసరమైతే రూ.35వేలు వరకు రుణాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఓటిఎస్ పథకాన్ని ఉగాది వరకూ ప్రభుత్వం పొడిగించిందని జెసి వెళ్లడించారు.
ఈ సమావేశంలో సిపిఓ జె.విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
