Every student should decide the goal, District Collector A. Suryakumari
Publish Date : 26/09/2022
ప్రతి విద్యార్ధీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
శృంగవరపుకోట, (విజయనగరం), సెప్టెంబరు 16 ః ప్రతి విద్యార్థీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. పదోతరగతి లోపే తమ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఎస్.కోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆధునీకరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీ ని, శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ లైబ్రరీ ఆధునీకరణకు, గ్రామానికి చెందిన లోతేటి సన్యాసప్పడు ఆర్థిక సాయం అందించగా, అతని కుమారుడు, పాఠశాల పూర్వ విద్యార్ధి, పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, మాతృ రుణం, పితృరుణం, గురు రుణం, జన్మభూమి రుణం ప్రతీఒక్కరూ ఎంతోకొంత తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు పాఠాలు చెప్పిన గురువులను ఎన్నడూ మర్చిపోరాదని, మంచి గురువును చూసి స్ఫూర్తి పొందాలని సూచించారు. పూర్వ విద్యార్ధిగా, పాఠశాల అభివృద్దికి కృషి చేస్తున్న శివశంకర్‌ను అభినందించారు. బహుద స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, సేవ చేస్తుండటం ప్రశంసనీయమన్నారు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, సమాజానికి మనం తిరిగి కొంత ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానం సాధించాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాల్సి ఉందన్నారు. ప్రక్కదారి పట్టించే ఎన్నో సాధనాలు ఇప్పుడూ మన చుట్టూ ఉన్నాయని, దారితప్పకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
పల్నాడు కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, ఏ వ్యక్తి అయినా ఉన్నత స్థానం చేరుకోవడానికి పుస్తకాలు సోపానమని అన్నారు. పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని, తద్వారా జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చని సూచించారు. అత్యధిక సమయం గ్రంథాలయంలో గడిపిన వ్యక్తులంతా, అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని ఉదహరించారు. తనకు చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యంపై ఉన్న అభిమానం, ఐఎఎస్ సాధనకు దోహదపడిందన్నారు. తనకు ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివిన నీతి కథలు, మహనీయుల జీవిత గాథలను చూసి స్ఫూర్తి పొందవచ్చని చెప్పారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అన్నారు. ధర్మవరం పాఠశాల పదోతరగతి విద్యార్థులకు, దసరా సెలవుల తరువాత ఒక పోటీ పరీక్ష నిర్వహించి, అత్యుత్తమ మార్కులు సాధించిన మొదటి 20 మందిని, ఐదు రోజుల ఢిల్లీ యాత్రకు పంపిస్తానని శివశంకర్ ప్రకటించారు.
ప్రముఖ కవి, ఆ పాఠశాల ఉపాధ్యాయుడు జిఎస్ చలం రూపొందించిన పుస్తకాలం సంకలనాన్ని సభలో ఆవిష్కరించారు. చలం, ఈ పుస్తకాన్ని శివశంకర్‌కు అంకితమిచ్చారు. గ్రామానికి చెందిన ఉప్పాడ పౌండేషన్ ప్రతినిధులు, గ్రామ శ్మశాన వాటిక అభివృద్దికి రూ.50వేల విరాళాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారికి ఈ సందర్భంగా అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన పిరమిడ్ ప్రదర్శన, కోలాటం ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వర్రావు, విశ్రాంత ఉపాధ్యాయులు బాబూరావు మాష్టారు ప్రసంగించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, తాశీల్దార్ డి.శ్రీనివాసరావు, ఎంపిడిఓ శేషుబాబు, ఎంఇఓ సత్యనారాయణ, హెచ్ఎం బి.లక్ష్మి, శివశంకర్ మాతృమూర్తి కృష్ణమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, బహుద సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
