Focus on crops with low investment, District Collector Mrs. Suryakumari advises farmers, visits Rythu Bharosa Kendras in Gantyada Mandal
Publish Date : 24/08/2022
@తక్కువ పెట్టుబడితో వచ్చే పంటలపై దృష్టి సారించండి
@రైతులు బాధ్యత తీసుకొని తమ భూములు రీసర్వే చేయించుకోవాలి
@ఫోర్టిఫైడ్ బియ్యంలో పోషక విలువలు అధికం -వాటిని అమ్ముకోవద్దు
@రైతులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి సూచన
@గంట్యాడ మండలంలో రైతుభరోసా కేంద్రాలు సందర్శన
విజయనగరం, ఆగష్టు 22 : పోషక విలువలు గల బియ్యం అందించడం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు భరించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మన జిల్లాలో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తోందని, అటువంటి బియ్యం ఇతరులకు అమ్ముకొనే ప్రయత్నం చేయకుండా రేషన్‌కార్డు దారులే వినియోగించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సూచించారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందజేసే బియ్యం విలువ ప్రతిఒక్కరూ తెలుసుకొని వాటిని వినియోగించాలని కోరారు. గంట్యాడ మండలంలోని నరవ, పెంట శ్రీరాంపురం గ్రామాల్లో కలెక్టర్ సోమవారం పర్యటించి రైతుభరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడి ఇ-పంట నమోదు, పంటల పరిస్థితులు, పంటలపై పెట్టుబడులు, ప్రత్యామ్నాయ పంటలు, భూ సమగ్ర సర్వేపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు, తక్కువ పెట్టుబడితో వచ్చే పంటలవైపు దృష్టి సారించాలని సూచించారు. రైతులు యూరియా తదితర రసాయనిక ఎరువులను అవసరాన్ని మించి వినియోగించవద్దని కోరారు. దానివల్ల భూముల సారం దెబ్బతింటుందన్నారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే అంశంపై వారితో మాట్లాడి తెలుసుకున్నారు. నరవలో నాగేశ్వరరావు అనే రైతు తనకున్న 4 ఎకరాల్లో పుచ్ఛకాయలు పండించినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ పంటపై పెట్టిన ఖర్చు, దిగుబడి, పంటపై వచ్చిన ఆదాయం తదితర సమాచారాన్ని తనకు అందజేయాలని కోరారు. రైతులు పండించే కూరగాయలు తదితర ఉత్పత్తులను హాస్టళ్లకు విక్రయించేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు.
రైతులు తమ భూములను సమగ్ర భూసర్వేలో భాగంగా దగ్గరుండి బాధ్యతగా రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. రైతులే ఇందులో బాధ్యత తీసుకొని సర్వే సిబ్బందితో తమ భూముల కొలతలు వేయించుకోవాలన్నారు. సమగ్ర భూసర్వేను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సర్వే విభాగం సిబ్బందికి సూచించారు. సమగ్ర భూసర్వేపై రైతులు, సర్వే సిబ్బందితో కలెక్టర్ పెంట శ్రీరాంపురంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రోజుకు ఎన్ని ఎకరాల్లో సర్వే జరుగుతుందో తెలుసుకున్నారు. ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నదీ లేనిదీ ఆరా తీశారు. రైతులు నానో యూరియా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై తెలుసుకున్నారు. పెంట శ్రీరాంపురం గ్రామానికి నాడు-నేడు కింద మంజూరైన పాఠశాల భవనం నిర్మాణాలను త్వరగా ప్రారంభించి పూర్తిచేయాలని కోరారు. గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం శాశ్వత భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ పర్యటనలో మండల తహశీల్దార్ ప్రసన్న రాఘవ, వ్యవసాయ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
