Focus on education and medical facilities in cities, avoid culture of flexi, take action to reduce plastic consumption, focus on waste management, District Collector in an online consultation with Municipal Commissioners
Publish Date : 20/04/2022
పట్టణాల్లో విద్య, వైద్య వసతులపై దృష్టి సారించాలి
ఫ్లెక్సీల సంస్కృతిని నివారించాలి
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలి
వ్యర్ధాల నిర్వహణపై దృష్టి పెట్టాలి
మునిసిపల్ కమిషనర్లతో ఆన్ లైన్ సదస్సులో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఏప్రిల్ 19 :
జిల్లాలోని మునిసిపల్ ప్రాంతాల్లో విద్య, వైద్యంపై కమిషనర్లు దృష్టి సారించి ఆయా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా ఆయా పట్టణాల్లో నివసించే ప్రజలకు విద్యా, వైద్య వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో నాలుగు పట్టణాల్లో నిర్మాణంలో వున్న పది పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఏప్రిల్ నెలాఖరుకు విజయనగరంలో మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభానికి సిద్ధంచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారిని ఆదేశించారు. ముఖ్యంగా పట్టణాల్లో వుండే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి, బహుళ అంతస్థుల నివాస భవనాల నుంచి వైద్య ఆరోగ్య సమాచారం అందడం లేదని, ఆయా వర్గాల నుంచి సమాచారం రాబట్టేలా మునిసిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి, ప్రజల ఆరోగ్య సమాచారం సేకరణకు పట్టణాల్లో బహుళ అంతస్థుల భవనాల్లో నివసించే వారు తగిన సహకారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు క్లినిక్‌ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రసూతి వైద్యసేవలు, కొత్తగా జన్మించిన శిశువుల సమాచారం, అబార్షన్లు, స్కానింగ్‌లకు సంబంధించిన సమాచారం అంతా వైద్య ఆరోగ్య సిబ్బందికి అందించేలా మునిసిపల్ కమిషనర్లు చొరవ చూపాలన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యర్ధాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పౌరసేవలపై నలుగురు మునిసిపల్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ ప్రగతిపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారి వివరించారు.
పట్టణాల్లోని పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పట్టణాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సి వుందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న ఫ్లెక్సీల సంస్కృతిని కూడా నివారించాలని, ఫ్లెక్సీల ఏర్పాటు చేసేవారిపై పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. దుకాణాల్లో ప్లాస్లిక్ సంచులు విక్రయించకుండా నిషేధించడం, ప్రజల్లో ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన కలిగించడం, పాఠశాలల్లో విద్యార్ధులు లంచ్ కోసం, తాగునీటి కోసం ప్లాస్టిక్ వస్తువులు వినియోగించుకుండా నిరోధించడం వంటి చర్యల వల్ల ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి పట్టణ స్థానిక సంస్థకు శాశ్వత ప్రణాళికలు వుండాలని చెప్పారు.
పదో తరగతి పరీక్షల్లో పట్టణ ప్రాంత మునిసిపల్ స్కూళ్ల నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా వారికి సబ్జెక్టులు బోధించే నిపుణులైన ఉపాధ్యాయులతో తగిన అవగాహన కలిగించాలని సూచించారు. అన్ని మునిసిపల్ స్కూళ్లలో మంచి ఫలితాలు రావాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనానికి ఇటీవలి కాలంలో పాడైపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వస్తోందని, దీనిపై ఆయా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయాలన్నారు.
మునిసిపాలిటీలో ఏదైనా ప్రభుత్వ భవనం ఖాళీగా వుంటే అందులో ఏదైనా కార్యకలాపాలు చేపట్టాలని వాటిని ఖాళీగా వుంచొద్దని స్పష్టంచేశారు. పట్టణాల్లో భవనాల ప్లాన్లకు అనుమతులు మంజూరు చేసేటపుడు నీటి సంరక్షణ చర్యలు వంటి అంశాల ఆధారంగా ప్లాన్లకు అనుమతులు ఇవ్వాలన్నారు. పట్టణాల్లో వ్యర్ధాల నిర్వహణకు శాస్త్రీయ విధానాలను అవలంబించాలన్నారు. బొబ్బిలి మునిసిపాలిటీలో వ్యర్ధాల నిర్వహణకు చేపడుతున్న చర్యల్ని ప్రశంసించారు.
జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వున్న నీటి ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల తయారీ సంస్థలను తనిఖీ చేసి నిబంధనల మేరకు ఆయా వ్యాపార సంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిదీ నివేదికలు పంపించాలన్నారు.
ఏపి టిడ్కో ఇళ్లను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తిచేయాలని మెప్మా పి.డి. సుధాకర్ మునిసిపల్ కమిషనర్లను కోరారు. జగనన్న తోడు, వై.ఎస్.ఆర్.ఆసరా, కిచెన్ గార్డెన్ల ఏర్పాటు, టెర్రస్ గార్డెన్ల ఏర్పాటుపై మెప్మా పి.డి. సమీక్షించారు.
