Focus on Nithi Ayog Ranks District Collector A. Suryakumari
Publish Date : 18/11/2021
నీతి అయోగ్ ర్యాంకులపై దృష్టి పెట్టండి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 18 ః నీతి అయోగ్ ర్యాంకులను మరింత మెరుగుపర్చేందుకు దృష్టి సారించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచికలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ, స్త్రీశిశు సంక్షేమం, విద్య, వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, జలయాజమాన్య సంస్థ, వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యానశాఖ, బ్యాంకింగ్, నైపుణ్య శిక్షణ, పంచాయితీ, పంచాయితీరాజ్, గృహనిర్మాణం తదితర శాఖలవారీగా, అంశాలవారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీతి అయోగ్ అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా పని చేయడమే కాకుండా, ఆ ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే వేక్సినేషన్ వేగవంతం చేయాలన్నారు. భూసార పరీక్షలను తక్షణమే ప్రారంభించి, సాయిల్ హెల్త్‌కార్డులను మంజూరు చేయాలని సూచించారు. వచ్చేనెలలో కనీసం లక్ష శాంపిల్స్‌ను సేకరించాలని ఆదేశించారు. అటల్ పెన్షన్ యోజనపై అసంఘిత రంగ కార్మికుల్లో అవగాహన కల్పించాలని, ఈ పథకాన్ని ఎక్కువమంది వినియోగించుకొనేలా చూడాలన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి, జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
