For the establishment of food and agricultural products, the units should use incentives and subsidies to set up women’s industries, District Collector Mrs. Suryakumari said in the meeting of the District Mahila Samakhya.
Publish Date : 24/08/2022
ఆహార, వ్యవసాయోత్పత్తుల ఏర్పాటుకు యూనిట్లకు ప్రోత్సాహం
రాయితీలు వినియోగించుకొని మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, ఆగష్టు 20 :చిన్న పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున లభిస్తున్న రాయితీలను వినియోగించుకొని మహిళలు పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సూచించారు. స్థానిక టి.టి.డి.సి. ప్రాంగణంలో శనివారం జరిగిన జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఆహార, వ్యవసాయోత్పత్తుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు వున్నాయని, వాటి ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ డి.ఆర్.డి.ఏ. అధికారులు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో నువ్వుల పంట పండిస్తున్న ప్రాంతాల్లో నూనె తీసే పరిశ్రమలను ఏర్పాటు వల్ల మంచి లాభాలు వుంటాయని, ఈ దిశగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో త్వరలో అమూల్ సంస్థ ద్వారా పాలసేకరణ ప్రారంభం అవుతుందని, పాల ఉత్పత్తుల ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు కూడా మంచి అవకాశాలు వుంటాయని వాటిపై కూడా దృష్టి సారించాలన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ.ల ఏర్పాటుపై 90శాతం వరకు రాయితీలు లభిస్తున్నాయని, ఇతర యూనిట్ల ఏర్పాటుకు పి.ఎం.ఇ.జి.పి. పథకం ద్వారా యూనిట్ల ఏర్పాటుకు అవకాశం వుందన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటుచేసి విజయవంతంగా నడిపిస్తున్న పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజయగాధలను డాక్యుమెంటేషన్ చేసి వారు పరిశ్రమలను ఏవిధంగా నిర్వహిస్తున్నారు, ఏవిధంగా పరిశ్రమల ద్వారా లాభాలు సాధిస్తున్నారనే విషయాన్ని ఇతరులకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని డి.ఆర్.డి.ఏ. అధికారులకు సూచించారు. కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటుకు కూడా మంచి అవకాశాలు వుంటాయని వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో మహిళ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు. మహిళలు తమ పిల్లలందరినీ బడికి పంపించాలని, ప్రతి మహిళా కోవిడ్ వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
డెంకాడకు చెందిన మహిళా సమాఖ్య సభ్యురాలు ఎజియో యాప్ ద్వారా పలువురు మహిళలు రెడీమేడ్ వస్త్రాల తయారీ చేస్తూ ఏవిధంగా లాభాలు ఆర్ఙిస్తున్నదీ వివరించారు.
అనంతరం టి.టి.డి.సి. ప్రాంగణంలో కొబ్బరితోటల్లో అంతర్ పంటగా తీగ పంటలను ప్రోత్సహించే విధంగా చిక్కుడు, పొట్ల, బీర, ఆనప, కీరదోశ తదితర విత్తనాలను కలెక్టర్ నాటారు. ఆకు కూరల పెంపకం కోసం విత్తనాలను, మునగ చెట్ల పెంపకానికి సంబంధించిన విత్తనాలను కలెక్టర్ నాటారు. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఏపిడి సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మీ, ఖాదీబోర్డు ఏ.డి. పద్మ, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి వెంకటసత్యవతి, ఉద్యానవన అధికారి రాజశేఖర్, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
