Close

*Gurajada’s life is inspiring for the future * Collector A. Surya Kumari in Gurajada Varthanthi Sabha

Publish Date : 01/12/2021

*గుర‌జాడ జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తిదాయ‌కం*
*గురజాడ వ‌ర్థంతి స‌భ‌లో క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి
*నివాళుల‌ర్పించిన గుర‌జాడ వార‌సులు, క‌లెక్ట‌ర్‌, జేసీ, డిప్యూటీ మేయ‌ర్‌

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 30 ః తెలుగు క‌వి గుర‌జాడ వెంక‌ట అప్పారావు జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని, ఆయ‌న అడుగు జాడ‌ల్లో నేటి త‌రం యువ‌త న‌డ‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. సామాజిక అంశాల‌ను వ‌న‌రులుగా మ‌లుచుకొని చేసిన ఆయ‌న ర‌చ‌న‌లు జిల్లాను పునీతం చేశాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న ర‌చ‌న‌లు, క‌థలు, క‌విత‌లు సామాజిక సృహ‌ను క‌లిగిస్తాయ‌ని, మేథా శ‌క్తిని పెంపొందిస్తాయ‌ని ఉద్ఘాటించారు. మంగ‌ళ‌వారం గుర‌జాడ 106వ‌ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ప‌ట్ట‌ణంలోని ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు.

      ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గుర‌జాడ వెంక‌ట అప్పారావు త‌న ర‌చ‌న‌ల‌తో స‌మాజాన్ని మేల్కొల్పార‌ని, భావిత‌రాల‌కు ఆద‌ర్శంగా నిలిచార‌ని కొనియాడారు. ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్కరూ కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో స‌త్య లాడ్జి వ‌ద్ద గుర‌జాడ స‌ర్కిల్ ను అభివృద్ధి చేయ‌గ‌లిగామ‌ని, వాట‌ర్ పౌంటైన్, లైటింగ్‌ కూడా ఏర్పాటు చేశామ‌ని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన వారు ఎక్క‌డ ఉన్నా గానీ.. గ్రామ సేవ‌లో భాగంగా ఇలాంటి అభివృద్ధి ప‌నుల‌కు చేయూత ఇవ్వాల‌ని కోరారు. ఆయ‌న న‌డ‌యాడిన జిల్లాను మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో న‌డిపించ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో విజేత‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ సూర్యకుమారి, జేసీ వెంక‌ట‌రావు, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి చేతుల మీదుగా బ‌హుమ‌తులు అంద‌జేశారు. గుర‌జాడ కుటుంబ స‌భ్యులను క‌లెక్ట‌ర్‌, జేసీ, డిప్యూటీ మేయ‌ర్ ఈ సంద‌ర్భంగా స‌త్క‌రించారు.

*గుర‌జాడ ఇంటి నుంచి కొన‌సాగిన శాంతి ర్యాలీ*

గుర‌జాడ ఇంటి వ‌ద్ద కార్యక్ర‌మం ముగిసిన అనంత‌రం స‌త్య లాడ్జి వ‌ద్ద ఏర్పాటు చేసిన గుర‌జాడ స‌ర్కిల్ వ‌ర‌కు విద్యార్థులు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు శాంతి ర్యాలీ నిర్వ‌హించారు. జేసీ వెంక‌ట‌రావు, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య నిర్వాహ‌కులు స‌భ్యులు, గుర‌జాడ కుటుంబ స‌భ్యులు ప్ర‌సాదు, ఇందిర‌, ల‌లిత, ఉపాధ్యాయులు త‌దిత‌రులు స‌ర్కిల్ లోని గుర‌జాడ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా జేసీ వెంక‌ట‌రావు, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి మాట్లాడుతూ గుర‌జాడ విజ‌య‌న‌గ‌రంలో స్థిర‌ప‌డ‌టం ద్వారా జిల్లాకు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న పేరు మీద జిల్లాలో యూనివ‌ర్శిటీ నెల‌కొల్పటం ఎంతో విశిష్ట‌దాయ‌క‌మ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

*Gurajada's life is inspiring for the future * Collector A. Surya Kumari in Gurajada Varthanthi Sabha