Identify each beneficiary, Secretariat staff should go to the field level and provide complete awareness on OTS, District Collector A. Suryakumari
Publish Date : 25/11/2021
ప్రతీ లబ్దిదారుడినీ గుర్తించండి
సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లాలి
ఓటిఎస్‌పై సంపూర్ణ అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 24 ః
గృహనిర్మాణ లబ్దిదారులందరినీ గుర్తించి, వారికి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. దీనికోసం సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రటీ ఇంటి వివరాలను పరిశీలించాలని ఆదేశించారు.
విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 24 సచివాలయాలకు చెందిన విఆర్ఓలు, డిఇఓలు తదితర సిబ్బందితో కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఓటిఎస్ అమలుపై సచివాలయాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, పథకం అమలును వేగవంతం చేయాలని కోరారు. అతితక్కువ మొత్తాన్ని చెల్లిస్తే, ఇంటిపై శాశ్వత హక్కులు లభించే ఈ పథకం లబ్దిదారులకు వరం లాంటిదని పేర్కొన్నారు. చాలామంది డబ్బు చెల్లించి, రిజిష్ట్రేషన్ చేసుకొనేందుకు సిద్దంగా ఉన్నారని, వారందరినీ గుర్తించి, వివరాలు తెలియజేయాలన్నారు. దీనికోసం సచివాలయ సిబ్బంది తమకు అందిన జాబితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో, ఆయా ఇళ్లలో నివాసం ఉంటున్నవారి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. వలంటీర్లు, ఆర్‌పిలు, కార్పొరేటర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాలు, సాంకేతిక సమస్యలను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
