Joint Collector instructed to be ready to prepare Fortified Rice to Rice Millers
Publish Date : 08/10/2021
పత్రికా ప్రకటన-6
రైస్ మిల్లులన్నీ ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి సిద్ధం కావాలి
బియ్యం తయారీకి యంత్ర పరికరాలు సమకూర్చుకోవాలి
రైస్ మిల్లర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్
విజయనగరం, అక్టోబరు 07; జిల్లాలోని రైస్ మిల్లులన్నీ వచ్చే నెల రోజుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి అవసరమైన యంత్ర పరికరాలను అమర్చుకొని ఫోర్టిఫైడ్ బియ్యం తయారుచేసి అందించేందుకు సిద్దంగా వుండాలని జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ చెప్పారు. రానున్న రోజుల్లో భారత ఆహారసంస్థ ఫోర్టిఫైడ్ బియ్యంను కొనుగోలు చేస్తుందని, అందువల్ల అన్ని మిల్లులు అవసరమైన యంత్ర పరికరాలను నవంబరు 15వ తేదీలోగా అమర్చుకోవలసి వుంటుందన్నారు. ఇకపై ఫోర్టిఫైడ్ రైస్ అందించే మిల్లులకే ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల్లో యంత్ర పరికరాలను అప్ గ్రేడ్ చేసుకోవడం, ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి వీలుగా పోషకాలను బియ్యంతో కలిపే యంత్ర పరికరాలను ఏర్పాటు చేసుకోవడం వంటి అంశాలపై రైస్ మిల్లు యజమానులతో చర్చించే నిమిత్తం గురువారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని రైస్ మిల్లర్లతో పాటు ధాన్యం సేకరణతో సంబంధం కలిగిన పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, బ్యాంకుల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా.కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వున్న మొత్తం 178 రైస్ మిల్లులలో ప్రస్తుతం 46 సార్టెక్స్ బియ్యం తయారీ సామర్ధ్యం గల మిల్లులు వున్నాయని, సార్టెక్స్తో పాటు ఫోర్టిఫైడ్ బియ్యం తయారుచేసే మిల్లులు 34 వరకు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో పి.డి.ఎస్., మధ్యాహ్న భోజన పథకం, ఇతర ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసే నిమిత్తం ప్రతి ఏటా 1.56 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం అవసరమని, ఈ మేరకు జిల్లాలోని మిల్లులే ఈ బియ్యం తయారుచేసి అందించాల్సి వుంటుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం సహా అన్ని ప్రభుత్వ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల రైస్ మిల్లులు ఫోర్టిఫైడ్ కోసం అవసరమైన యంత్ర పరికరాలు రూపొందించాల్సిందేనని పేర్కొన్నారు. జిల్లా అవసరాల కోసం ప్రస్తుతం తూర్పుగోదావరి నుంచి లక్ష టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నారని, రానున్న రోజుల్లో జిల్లాలోనే ఈ బియ్యం అందించాల్సి వుంటుందన్నారు.
జిల్లాలో ధాన్యం నిల్వ సామర్ధ్యం, సదుపాయాలు పెంచేందుకు అదనపు గోదాములు నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ ఆలోచిస్తున్నారని జె.సి. చెప్పారు. బ్యాంకుల ద్వారా గోదాముల నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. అన్ని రైస్ మిల్లులు అక్టోబరు 31 నాటికి బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని సూచించారు.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 5.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ డి.డి. నంద్ వివరించారు.
సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డి.నాయక్, డి.ఎస్.ఓ. పాపారావు, మార్కెటింగ్ ఏ.డి. శ్యాం, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కె.కొండబాబు, డి.ఆర్.డిఏ ఏపిడి సావిత్రి, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
————————————————————————————————————————————-
జారీ సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం
