Joint Collector Kishore kumar angry with land officers, orders to hand over airport lands & How many more years to stretch?
Publish Date : 17/11/2021
ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారు ?
భూసేకరణ అధికారులపై జెసి కిశోర్ ఆగ్రహం
ఎయిర్పోర్ట్ భూముల అప్పగింతకు సిద్దం కావాలి
నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశం
విజయనగరం, నవంబరు 16 ః భోగాపురం ఎయిర్‌పోర్టు భూములను అప్పగించేందుకు సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. సత్వరమే మిగిలిన భూసేకరణను పూర్తి చేయాలని, ఇప్పటివరకు సేకరించిన స్థలాన్ని చదునుచేసి, పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూసేకరణపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జెసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భూసేకరణ అధికారుల తీరుపై జెసి మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం వెంట తరుముతున్నా….భూసేకరణను ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో తాము నిత్యం పర్యటిస్తున్నా, ప్రత్యేక ఉప కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు చూపిస్తున్న నిర్లిప్త వైఖరిపై, జెసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరు ఇలాగే ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ పనికి నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకొని, పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆయా గ్రామాల వారీగా జెసి సమీక్షించారు. కోర్టు వివాదాలపై ఆరా తీశారు. వివిధ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, కెఆర్ఆర్‌సి ఉప కలెక్టర్ బి.పద్మావతి, ఎయిర్‌పోర్టు సమన్వయాధికారి జి.అప్పలనాయుడు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
