Linking of Aadhaar for voting by March, political parties should cooperate fully, voter list revision process from August 4, Joint Collector Mayur Ashok
Publish Date : 02/08/2022
మార్చి లోగా ఓటుకు ఆధార్ అనుసంధానం
రాజకీయ పార్టీలు సంపూర్ణంగా సహకరించాలి
ఆగస్టు 4 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం, ఆగస్టు 01 ః వచ్చే ఏడాది మార్చి లోగా ఓటుకు ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయనున్నామని, దీనికి రాజకీయ పార్టీలు సంపూర్ణంగా సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఓటుకు ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రత్యేకంగా ఫారమ్ 6బితో దరఖాస్తు చేయాలన్నారు. ఆధార్ కార్డు లేనివారు, ఉపాధిహామీ జాబ్ కార్డు, ఫొటో కలిగిన బ్యాంకు పాస్‌బుక్, కార్మిక శాఖ ద్వారా పొందిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్‌జిఐ ద్వారా గుర్తింపు పొందిన స్మార్టు కార్డు, ఇండియన్ పాస్‌పోర్టు, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డు, ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్‌సిల ద్వారా పొందిన గుర్తింపు కార్డు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పొందిన గుర్తింపు కార్డును సమర్పించవచ్చని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసుకొనేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించడం జరుగుతుందన్నారు. ఆధార్ అనుసంధానికి ఓటర్లను చైతన్యపరచాలని కోరారు. ప్రతీఏటా జరుగుతున్నట్లుగానే ఈ ఏడాది ఆగస్టు 4 నుంచి ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. తప్పులు లేని ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాల సవరణ, మార్పులు, చేర్పులకు అక్టోబరు 24 వరకు ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తుది జాబితా జనవరి 5న ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ పౌరుడికీ ఓటుహక్కు కల్పించేందుకు పార్టీలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు వివరించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంగలి పోతన్న మాట్లాడుతూ, దోషరహిత, పరిపూర్ణమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. ప్రతీఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు కృషి చేయాలని, దీనికోసం అందుబాటులో ఉన్న వలంటీర్, సచివాలయ, రెవెన్యూ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు. టిడిపి నాయకులు ఎం.ప్రవీణ్ మాట్లాడుతూ, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి అన్నారు. ఓటర్ల సవరణ సమయంలో, బిఎల్ఓలు పోలింగ్ బూత్‌ల్లో పూర్తిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో సెల్‌ఫోన్లకు మెసేజ్ రూపంలో ఓటు వివరాలను తెలియజేయాలని సూచించారు. ఆప్ నాయకులు దయానంద్ మాట్లాడుతూ, ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వలంటీర్లు భాగస్వాములు కాకుండా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితాలనుంచి తొలగించాలని, ఒక కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ బూత్ లో ఉండేలా చూడాలని సూచించారు. జనసేన నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ, చాలా ఓట్లు ఇటు పట్టణ ప్రాంతంలో, అటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఉన్నాయని, దీనివల్ల ఓటు దుర్వినియోగం జరుగుతోందని చెప్పారు. ఆధార్ సీడింగ్ వల్ల దొంగ ఓట్లకు అడ్డుకట్ట పడుతుందని సూచించారు. బిజెపి నాయకులు రాజేష్ మాట్లాడుతూ, ఓటుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వాములను చేయోద్దన్నారు. ఈ సమావేశంలో టిడిపి ప్రతినిధి సిహెచ్ కుటుంబరావు, వైకాపా ప్రతినిధి రెడ్డి, జనసేన ప్రతినిధి టి.రామకృష్ణ, ఆప్ ప్రతినిధి కృష్ణంరాజు, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.
