* Medical personnel should be vigilant * * In the audit review on maternal and infant deaths, Collector Suryakumari * advised to take appropriate action before the loss of life.
Publish Date : 01/12/2021
వైద్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి సూచించారు. ప్రాణ నష్టం జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల సంభవించిన మాతా శిశు మరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఆమె ఆధ్వర్యంలో ఆడిట్ రివ్యూ జరిగింది. జిల్లా వైద్యారోగ్య అధికారి ఎస్.వి. రమణ కుమారి, అదనపు డీఎం & హెచ్‌వో రామ్మోహన్ రావు జిల్లాలోని తాజా పరిస్థితిని ముందుగా వివరించారు. వివిధ కారణాలతో ఇటీవల కాలంలో ఆరుగురు మృత్యువాత పడినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వివిధ పీహెచ్‌సీల నుంచి వచ్చిన వైద్యాధికారులు ఇటీవల జరిగిన మాతా శిశు మరణాలపై నివేదికలను చదివి వినిపించారు. ఈ క్రమంలో మరణాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది విధుల పట్ల అంకితభావం ప్రదర్శించాలని పేర్కొన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గమనించి ప్రాణ నష్టం జరగకుండా జాగురూకత వహించాలని సూచించారు. డెంగీ, మలేరియా వంటి కారణాలతో మాతృ మరణాలు జరగకుండా నిలువరించాలని, ముందుగానే జాగ్రత్తపడాలని చెప్పారు. ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
*వ్యాక్సినేషన్ ప్రక్రియను బాధ్యతగా నిర్వహించండి*
వ్యాక్సినేషన్ ప్రక్రియను భారంగా కాకుండా.. బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇంకా సుమారు 3 లక్షల మందికి టీకా వేయాల్సి ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయని గుర్తు చేశారు. అందరూ సమన్వయం వ్యవహరించి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలని చెప్పారు. అందరి ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావుకు ఈ సందర్భంగా సూచించారు.
కార్యక్రమంలో డీఎం & హెచ్‌వో డా. ఎస్. వి. రమణ కుమారి, అదనపు డీఎం & హెచ్‌వో డా. రామ్మోహన్ రావు, డీసీహెచ్ఎస్ డా. నాగభూషణరావు, జిల్లా పరిషత్ సీఈవో టి. వెంకటేశ్వరరావు, ఘోష ఆసుపత్రి గైనకాలజిస్ట్ డా. నాగ శివజ్యోతి, ఇతర వైద్యాధికారులు, పీహెచ్‌సీల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, నర్శింగ్ సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
