Names of donors for government buildings District Collector A. Suryakumari, Poosapatirega, Nellimarla Zones Visit the Anganwadi Center for extensive visits and visits to the Tenth Test Centers
Publish Date : 29/04/2022
ప్రభుత్వ భవనాలకు దాతల పేర్లు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో విస్తృత పర్యటన
పదోతరగతి పరీక్షా కేంద్రాల సందర్శన
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
పూసపాటిరేగ, నెల్లిమర్ల (విజయనగరం), ఏప్రెల్ 29 ః
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే, ఆ భవనాలకు వారి పేర్లు పెడతామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. పాఠశాలలు, తరగతి గదులు, ఆసుపత్రులతోపాటు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి దాతల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.
*విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి*
పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాన్ని కలెక్టర్ సందర్శించారు. కళాశాలను, తరగతి గదులను పరిశీలించారు. కళాశాల పూర్తి వివరాలను ప్రిన్సిపాల్ కెఎంపి నారాయణరావు వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో మాట్లాడారు. వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల గురించి ప్రశ్నించారు. వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. ప్రతీఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. కష్టపడి చదవడం ద్వారా ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని సూచించారు.
*పదోతరగతి పరీక్షా కేంద్రాల సందర్శన*
మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా పూసపాటిరేగ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ పాఠశాలకు 189 మంది విద్యార్ధులను కేటాయించగా, అందరూ హాజరయ్యారని సెంటర్ ఛీప్ కె.ధర్మకుమార్ తెలిపారు. కోనాడ జంక్షన్‌లోని ఆర్డర్ స్కూల్‌ను సందర్శించి, పరీక్ష నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ పాఠశాలకు 238 మంది విద్యార్థులను కేటాయించగా, అందరూ హాజరైనట్లు పరీక్షా కేంద్రం ఛీఫ్ ఆర్.విజయ్‌కుమార్ తెలిపారు. అనంతరం అక్కడికి సమీపంలోని సెయింట్ ప్రాన్సిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ పాఠశాలకు మొత్తం 180 మంది విద్యార్థులను కేటాయించగా, ఒక్కరు గైర్హాజరు అయినట్లు, సెంటర్ ఛీఫ్ ఐ.రాజేశ్వర్రావు వివరించారు. పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, చూసిరాతలకు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆయా సెంటర్ల ఛీఫ్‌లను కలెక్టర్ ఆదేశించారు.
*అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ*
పాతకొప్పెర్లలోని అంగన్ వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్లను పరిశీలించారు. పిల్లల ఎత్తు, బరువును కొలిపించి, స్వయంగా తనిఖీ చేశారు. పిల్లల అవగాహనా స్థాయిని తెలుసుకున్నారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అంగన్‌వాడీ కార్యకర్త కనకరత్నం, సహాయకురాలు ముత్యాలు వివరించారు. ఈ కేంద్రం పరిధిలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి ఇవ్వాల్సిన పోషకాహారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని వారు చెప్పారు. అంగన్‌వాడీ భవనం చాలా ఇరుకుగా ఉన్నందున, కొత్త భవనం నిర్మాణానికి దాతల సహకారాన్ని తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొత్త భవనం నిర్మాణానికి తగిన స్థలాన్ని సేకరించాలని, పూసపాటిరేగ తాశీల్దార్ కృష్ణమూర్తిని ఆదేశించారు.
*జగనన్న కాలనీ సందర్శన*
నెల్లిమర్ల మండలం జరజాపుపేట హౌసింగ్ కాలనీని, నిర్మాణంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాలనీలోని బోరుకు మోటార్‌ను బిగించి, సాయంత్రానికి నీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇంకా ప్రారంభించని 8 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆలస్యం చేస్తే ఇళ్లను రద్దుచేయడం జరుగుతుందని చెప్పారు. కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని, ఇళ్ల నిర్మాణం మొదలు కాకపోతే, ఇంజనీరింగ్ అసిస్టెంట్లపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ రమణరాజు, హౌసింగ్ డిఇ మురళి, ఏఈ రమణరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
