Close

Opportunity to procure grain for rice mills if the machines are set up, 3 months deadline for setting up machines for sortex, fortified rice, loans through banks for setting up of machines, Joint Collector Mayor at meeting of rice millers

Publish Date : 23/06/2022

యంత్రాలు అమ‌రిస్తేనే రైస్ మిల్లుల‌కు ధాన్యం సేక‌ర‌ణ‌కు అవ‌కాశం

సార్టెక్స్‌, ఫోర్టిఫైడ్ బియ్యం కోసం యంత్రాలు అమ‌ర్చేందుకు 3 నెల‌ల గ‌డువు

యంత్రాల ఏర్పాటుకోసం బ్యాంకుల ద్వారా రుణాలు

రైస్ మిల్ల‌ర్ల స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్

విజ‌య‌న‌గ‌రం, జూన్ 22 :జిల్లాలోని రైస్ మిల్లుల‌న్నీ ఇక‌పై సార్టెక్స్‌, ఫోర్టిఫైడ్ బియ్యం త‌యారీకి అవ‌స‌ర‌మైన యంత్రాలు క‌లిగి వుండ‌టం త‌ప్ప‌నిస‌రి అని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ పేర్కొన్నారు. ఈ యంత్రాలు క‌లిగి వున్న మిల్లుల‌కే ఇక‌పై ధాన్యం సేక‌ర‌ణ‌కు కేటాయింపులు చేస్తామ‌ని స్ఫ‌ష్టంచేశారు. వ‌చ్చే రెండు మూడు నెల‌ల కాలంలో సార్టెక్స్‌, ఫోర్టిఫైడ్ యంత్రాలు లేని మిల్లుల‌న్నీ వాటిని ఏర్పాటు చేసుకోవ‌ల‌సి వుంటుంద‌న్నారు. జిల్లాలోని ఈ యంత్రాలు అమ‌ర్చుకోని 72 రైస్ మిల్లుల య‌జ‌మానుల‌తో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ బుధ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాలో మొత్తం 132 రైస్ మిల్లుల‌కు గాను 61 మిల్లులు సార్టెక్స్ యంత్రాల‌ను, 48 ఫోర్టిఫైడ్ బియ్యం త‌యారీ యంత్రాల‌ను క‌లిగి వున్నాయ‌ని జె.సి. చెప్పారు.

      రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌న జిల్లాతో స‌హా ఏడు జిల్లాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ కింద ఫోర్టిఫైడ్ బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల‌కూ ఈ బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని అందువ‌ల్ల ఈ బియ్యం త‌యారు చేసే మిల్లుల‌కు గిరాకీ ఏర్ప‌డ‌నుంద‌ని జె.సి. చెప్పారు. మ‌న పొరుగు జిల్లాలైన విశాఖ‌, అన‌కాప‌ల్లి, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో వ‌చ్చే నెల నుంచే ఈ బియ్యం స‌ర‌ఫ‌రా ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఆయా జిల్లాల్లో మిల్లుల‌కు ఫోర్టిఫైడ్ యంత్రాలు లేని కార‌ణంగా మ‌న జిల్లా నుంచే బియ్యం స‌ర‌ఫ‌రా చేసే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు. దీనివ‌ల్ల రైస్ మిల్లుల‌కు కూడా వ్యాపారం పెరుగుతుంద‌న్నారు.

       త‌మ రైస్ మిల్లుల‌కు ఈ యంత్రాలు అమ‌ర్చుకోడానికి సిద్ధంగా వున్నామ‌ని, అంత పెట్టుబ‌డి త‌మ వ‌ద్ద లేనందున త‌మ‌కు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాల‌ని రైస్ మిల్ల‌ర్లు జె.సి.ని కోరారు. దీనిపై జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు సి.ఇ.ఓ. జ‌నార్ధ‌న‌రావు స్పందిస్తూ త‌మ బ్యాంకు ఆధ్వ‌ర్యంలోని ప్రాథ‌మిక స‌హ‌కార సంఘాల ద్వారా రైస్ మిల్లుల‌కు అవ‌స‌ర‌మైన రుణాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. జాతీయ బ్యాంకుల ద్వారా కూడా రైస్ మిల్లుల‌కు రుణాలు ఇవ్వాల‌ని జె.సి. ఏ.ఎల్‌.డి.ఎం. దీప్తి ప్ర‌త్యూష‌కు సూచించారు. ముద్ర ప‌థ‌కం కింద కూడా రైస్ మిల్లుల‌కు రుణాలు ఇచ్చే అంశం ప‌రిశీలించాల‌ని ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం అధికారులు, బ్యాంకుల‌ను జె.సి. కోరారు.

    రైస్ మిల్లుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల్లో కొంత‌యినా విడుద‌ల చేయాల‌ని రైస్ మిల్ల‌ర్లు కోర‌గా ఈ అంశంపై  పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఎం.డి.తో మాట్లాడ‌తాన‌ని జె.సి తెలిపారు.

    పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్ మీనా, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి పాపారావు, ఏ.డి. క‌ళింగ‌వ‌ర్ద‌న్‌, రైస్ మిల్ల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు కొండ‌ప‌ల్లి కొండబాబు, వివిధ బ్యాంకుల అధికారులు, నాన్ సార్టెక్స్ మిల్లుల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Opportunity to procure grain for rice mills if the machines are set up, 3 months deadline for setting up machines for sortex, fortified rice, loans through banks for setting up of machines, Joint Collector Mayor at meeting of rice millers