Close

* OTS is not aimed at collecting money * * District Collector A. Suryakumari at the review meeting

Publish Date : 07/12/2021

*డ‌బ్బులు వ‌సూలు చేయ‌టం ఓటీఎస్ ల‌క్ష్యం కాదు*

* ల‌బ్ధిదారుల‌కు శాశ్వ‌త ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌టం ప్ర‌ధాన ఉద్దేశం

* స‌మీక్షా  స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి

* సానుకూల దృక్ప‌థం క‌ల్పించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు

* రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచ‌న‌

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 06 ః డ‌బ్బులు వ‌సూలు చేయ‌టం ఓటీఎస్ (ఒన్ టైం సెటిల్మెంట్‌) ప‌థ‌కం  ల‌క్ష్యం కాద‌ని.. ల‌బ్ధిదారులకు శాశ్వ‌త ప్ర‌యోజ‌నాలు కల్పించ‌ట‌మే ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. క్షేత్ర‌స్థాయిలో సానుకూల దృక్ప‌థం క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో స‌దుద్దేశాల‌తో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కంపై కొంత‌మంది త‌ప్పుడు  ప్ర‌చారం చేస్తున్నార‌ని విచారం వ్య‌క్తం చేశారు. సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా దీన్ని తిప్పికొట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ఓటీఎస్ అమ‌లు తీరుపై స‌మీక్షించేందుకు జిల్లాలోని ప్ర‌త్యేక అధికారులు, ఎంపీడీవోలు, త‌హ‌శీల్దార్ల‌తో  సోమ‌వారం ఆమె ఆన్‌లైన్ స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా రిజిస్ట్రార్ సృజ‌న రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై వివ‌రించారు. ఏయే డాక్యుమెంట్ల‌ను ఆన్‌లైన్‌లో పొందుప‌ర‌చాలి, ఎక్క‌డెక్క‌డ త‌హ‌శీల్దార్‌, స‌బ్ రిజిస్ట్రార్ సంత‌కాలు అవ‌స‌రం త‌దిత‌ర వివ‌రాలు తెలియ‌జేశారు.

    ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ ఓటీఓస ప‌థ‌కం పూర్తిగా స్వచ్చంద‌మ‌ని, దీనిపై ఎలాంటి ఒత్తిడి ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. కొంత‌మంది త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని విచారం వ్య‌క్తం చేశారు.ల‌బ్ధిదారుల‌కు ఓటీఎస్ ప్ర‌యోజ‌నాల‌ను సంపూర్ణంగా వివ‌రించ‌టం ద్వారా దీన్ని తిప్పి కొట్టాల‌ని సూచించారు. జ‌గ‌న‌న్న శాశ్వ‌త గృహ హ‌క్కు ప‌థ‌కం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలోని అధికారులు, సిబ్బంది బాగానే క‌ష్ట‌ప‌డ్డార‌ని కానీ ఎందుకో ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేవ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. మ‌రింత క‌ష్ట‌ప‌డి ఓటీఎస్‌లో మెరుగైన ఫ‌లితాలు తీసుకురావాల‌ని సూచించారు. అలాగే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌పై పూర్తిగా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని త‌హ‌శీల్దార్ల‌కు, ప్ర‌త్యేక అధికారుల‌ను ఆదేశించారు. ఏమైనా సందేహాలుంటే జిల్లా రిజిస్ట్రార్‌, హౌసింగ్ పీడీని సంప్ర‌దించాల‌ని చెప్పారు.

*ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేయండి*

     అనంత‌రం జేసీలు మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, వెంక‌ట‌రావులు మాట్లాడారు. స్థానికంగా ఉండే ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేసుకొని ప‌థ‌కం తాలూక ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. బుధ‌వారం జిల్లా వ్యాప్తంగా మెగా క్యాంపైన్ నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1.7 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారులుండ‌గా.. వారి నుంచి సుమారు రూ.7 కోట్లు వ‌సూలైన‌ట్లు వివ‌రించారు. అయితే అందులో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.4 కోట్లు మాత్ర‌మే అకౌంట్‌లో డిపాజిట్ అయ్యింద‌ని మిగ‌తా న‌గ‌దు ఖాతాల్లో జ‌మ చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. బ్యాంకుల నుంచి రుణం పొందే విష‌యంలో అనుస‌రించాల్సిన విధానంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. క్షేత్ర‌స్థాయిలో ఉండే ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేయ‌టం ద్వారా ఈ జ‌గ‌న‌న్న శాశ్వ‌త గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. అన్ని ప‌త్రాలు స‌రి చూశాకే రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల‌పై త‌హ‌శీల్దార్ అప్రూవ‌ల్ సంతకం చేయాల‌ని చెప్పారు. వివాదాస్ప‌ద స్థ‌లాల్లో ఉన్న ఇళ్ల‌కు సంబంధించి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియను వాయిదా వేయాల‌ని జేసీ మ‌యూర్ అశోక్ చెప్పారు.

    కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఆర్‌. మ‌హేశ్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, జె. వెంక‌ట‌రావు, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్‌, డీఆర్‌డీఏ పీడీ అశోక్  కుమార్, జిల్లా రిజిస్ట్రార్ సృజ‌న‌, జ‌డ్పీ సీఈవో టి. వెంక‌టేశ్వ‌ర‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్‌, కో-ఆప‌రేటివ్ అధికారి అప్ప‌ల‌నాయుడు, డీపీవో సుభాషిణి, ఫిష‌రీస్ డీడీ నిర్మ‌లాకుమారి, డీఎస్‌వో పాపారావు, సివిల్ స‌ప్లై డీఎం నాయ‌క్‌, డీపీఎం ప‌ద్మావ‌తి, ఎస్‌.ఎస్‌.ఎ. పీవో స్వామినాయుడు, డ్వామా పీడీ ఉమాప‌ర‌మేశ్వ‌రి, మార్కెటింగ్ ఏడీ శ్యామ్ కుమార్ ఇత‌ర ప్ర‌త్యేక అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

* OTS is not aimed at collecting money * * District Collector A. Suryakumari at the review meeting