Raise awareness on Atrocities Act, District Collector A. Suryakumari
Publish Date : 29/12/2021
అట్రాసిటీ చట్టంపై అవగాహన పెంచాలి
బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, డిసెంబరు 27 ః ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోదక చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఈ చట్టంపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్, ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటి కేసుల నమోదు, వాటి పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్‌జిఓల సహకారంతో అట్రాసిటీ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందని అన్నారు. కేసులు నమోదు చేసిన వెంటనే, వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్ కేసులను వీలైనంత వేగంగా పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. బాధితులకు ఎప్పటికప్పుడు పరిహారం అందించాలని, వారికి అన్నివిధాలా ప్రభుత్వపరంగా సహాయాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఏడాది అక్టోబరు 8వ తేదీన జరిగిన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును, ప్రస్తుత సమావేశపు అజెండాను, సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్‌రాజ్‌కుమార్ వివరించారు. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ నెల 10 వ తేదీ వరకు జిల్లాలో కొత్తగా 21 అట్రాసిటీ కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసుల ప్రస్తుత పరిస్థితిని పోలీసు అధికారులు, పిపి వివరించారు. ఛార్జిషీట్ వేసిన వెంటనే, బాధితులకు పరిహారాన్ని అందజేయడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
