Close

Reach Nithiyogi Goals Field-Inspected Collector Suryakumari Inspection of Extensive Secretariats and Examination Centers in Bobbili

Publish Date : 11/05/2022

నీతిఅయోగ్ ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి
క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన‌ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి
బొబ్బిలిలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌
స‌చివాల‌యాలు, ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ
బొబ్బిలి (విజ‌య‌న‌గ‌రం), మే 10 ః
               నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం సాధించాల‌ని అధికారుల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచిక‌ల్లో అత్యంత కీల‌క‌మైన‌ వైద్యారోగ్యం, పౌష్టికాహార పంపిణీ, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు త‌దిత‌ర అంశాల అమ‌లు తీరును క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. వీటిపై సిబ్బందికి ప‌లు కీల‌క‌ సూచ‌న‌లు చేశారు.
*ప‌రీక్షా కేంద్రాల‌ ప‌రిశీలన‌*
               క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం బొబ్బిలి మండ‌లంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఆమె ముందుగా ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశారు. రాజా కాలేజ్‌, వాసు జూనియ‌ర్ క‌ళాశాల్ల‌లో ఇంట‌ర్  ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. ఆయా సెంట‌ర్ల ఛీఫ్ సూప‌రింటిండెంట్ల‌తో మాట్లాడారు. విద్యార్థుల‌కు క‌ల్పించిన సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు.  ప‌రీక్ష‌ల‌ను క‌ట్టుదిట్టంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.
*స‌చివాల‌యాలు త‌నిఖీ*
               పిరిడి గ్రామంలోని రెండు స‌చివాల‌యాల‌ను క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజ‌రును, రికార్డుల‌ను ప‌రిశీలించారు. హాజ‌రు త‌క్కువ‌గా ఉన్న వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు. వ‌లంటీర్లు క‌నీసం వారానికి మూడు రోజుల‌పాటు స‌చివాల‌యానికి హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఓటిఎస్ అమలుపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఓటిఎస్ చెల్లించిన‌వారికి బ్యాంకుల‌నుంచి రుణాల‌ను ఇప్పించాల‌ని సూచించారు. స‌చివాల‌య సిబ్బంది నిర్లిప్త‌త‌ను విడ‌నాడి, ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని అన్నారు. శ‌త‌శాతం గృహ‌నిర్మాణం పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన ప్ర‌తీఒక్క‌రిచేతా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింప‌జేయాల‌ని, లేదంటే ఇళ్లు ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఒక‌సారి ఇళ్లు ర‌ద్ద‌యితే, మరోసారి మంజూరు కాద‌ని స్ప‌ష్టం చేశారు. అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌పై ప్ర‌శ్నించారు. యూజ‌ర్ ఛార్జీల వ‌సూలుపై ప్ర‌శ్నించారు. ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారాన్ని తీసుకొని, ఓటిఎస్ ప‌థ‌కాన్ని అర్హులంద‌రూ వినియోగించుకొనేలా చూడాల‌ని సూచించారు. ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌పై ప్ర‌శ్నించారు. ప‌నులు ప్ర‌తిపాదించ‌క‌పోవ‌డం ప‌ట్ల సిబ్బందిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే అవ‌స‌ర‌మైన‌చోట‌ గ్రావెల్ రోడ్లు నిర్మించాల‌ని సూచించారు. ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరారు. గ్రామాన్ని ఆనుకొని వెళ్తున్న పంట‌ కాలువ‌లో పూడిక తీయించాల‌ని గ్రామ‌స్తులు కోర‌గా, ఆ ప‌నుల‌ను ఉపాధిహామీ ప‌థ‌కం క్రింద యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.
*నీతి అయోగ్ అంశాల‌పై ఆరా*
                నీతి అయోగ్ అంశాల అమ‌లు తీరును గ్రామ‌స్థాయిలో క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి స‌మ‌క్షంలో, స‌చివాల‌య ప‌రిధిలో అంశాల‌వారీగా, వాటి అమ‌లుపై స‌మీక్షించారు. గ‌ర్భిణుల న‌మోదు, వారికి అందిస్తున్న పోష‌కాహారం, మాతృ, శిశు మ‌ర‌ణాలు, పిల్ల‌ల‌కు, గ‌ర్భిణుల‌కు అమ‌లు చేస్తున్న టీకా కార్య‌క్ర‌మాల‌పై ఎఎన్ఎంలు, ఆశా కార్య‌క‌ర్త‌లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శ్నించారు. వారి రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. గ‌ర్భిణుల న‌మోదు విష‌యంలో జాప్యం జ‌రుగుతుండ‌టంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. కొంద‌రు గ‌ర్భిణులు త‌మ పేర్ల‌ను ఎందుకు న‌మోదు చేసుకోవ‌డం లేదో, క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీ చేసి, త‌న‌కు నివేదిక‌ను ఇవ్వాల‌ని డిఎంఅండ్‌హెచ్ఓను ఆదేశించారు. పిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుతీరుపై ప్ర‌శ్నించారు. వేలిముద్ర‌లు ప‌డ‌టం లేద‌న్న కార‌ణంతో, ఎవ‌రికైనా రేష‌న్ బియ్యం పంపిణీని ఆపివేస్తే ఊరుకొనేది లేద‌ని హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని, అటువంటి వారికి వెంట‌నే రేష‌న్ పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.
*ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రం త‌నిఖీ*
                 పిరిడి గ్రామంలోని ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. డాక్ట‌ర్ల‌తో మాట్లాడి, రోజువారీ వ‌స్తున్న రోగుల సంఖ్య‌, వారికి అందిస్తున్న సేవ‌ల వివ‌రాల‌ను తెలుసుకున్నారు. ప్ర‌సూతి వార్డును సంద‌ర్శించారు. బాలింత‌లు, గ‌ర్భిణుల‌తో మాట్లాడారు. రోగుల‌కు మ‌రింత మెరుగ్గా సేవ‌ల‌ను అందించాల‌ని, వైద్యాధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
                ఈ ప‌ర్య‌ట‌న‌లో  డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, బొబ్బిలి తాశీల్దార్ వి.రామ‌స్వామి, ఎంపిడిఓ పి.చంద్ర‌మ్మ‌, మండ‌ల స్థాయిలోని వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Reach Nithiyogi Goals Field-Inspected Collector Suryakumari Inspection of Extensive Secretariats and Examination Centers in Bobbili