Close

Resolve to satisfy the people * * Care should be taken not to repeat the complaints * District Collector A. Suryakumari reviewing the response

Publish Date : 11/04/2022

*ప్ర‌జ‌లు సంతృప్తి చెందేలా ప‌రిష్కారం చూపాలి*
*ఫిర్యాదులు మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా జాగ్ర‌త్త‌లు వహించాలి
*స్పంద‌న‌పై స‌మీక్ష‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 08 ః వివిధ స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఒకే స‌మ‌స్య‌పై ఫిర్యాదుల రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రీ ఓపెన్ రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. నిర్ణీత కాలంలో ఫిర్యాదుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం చూపాల‌ని, కింది స్థాయి అధికారి ఇచ్చిన రిప్లై స‌మాధానాన్ని ఉన్న‌తాధికారి ఒక సారి ప‌రిశీలించాలన్నారు. విన‌తుల పరిష్కారంలో అధికారులు ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ వ‌హించాల‌ని, బీయాండ్ ఎస్‌.ఎల్‌.ఎ. ప‌రిధిలోకి వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో స్పంద‌న ద్వారా, ఏపీ సేవా పోర్ట‌ల్ ద్వారా వ‌చ్చే విన‌తుల‌ ప‌రిష్కారంపై జ‌రిగిన స‌మీక్షలో ఫిర్యాదుల స్థితిగ‌తుల‌పై ఆమె స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చిన ఫిర్యాదులే మ‌ళ్లీ మ‌ళ్లీ ఎందుకు వ‌స్తున్నాయనే అంశంలో అధికారులంతా పునఃప‌రిశీలించుకొని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి క‌లెక్ట‌ర్ సూచించారు.

అధికంగా రెవెన్యూ, పింఛ‌న్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ స‌దుపాయం క‌ల్పన‌, గృహ నిర్మాణం, పాడి ప‌రిశ్ర‌మ తదిత‌ర స‌మ‌స్య‌ల‌కు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయ‌ని ఆయా శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ స‌మ‌స్య‌ల‌ను నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అలాగే అన్ని విభాగాల అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి స్పంద‌న, ఇత‌ర విన‌తుల ప‌రిష్కారంలో అనుస‌రించాల్సిన విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. అవ‌సరమైతే మండ‌ల స్థాయిలో శిక్ష‌ణ స‌ద‌స్సులు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. బియ్యం కార్డు జారీలో ఎక్కువ‌గా సాంకేతిక‌ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయ‌ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డి.ఎస్.ఓ.ను ఆదేశించారు.

*స‌చివాల‌యాల‌కు త‌ప్ప‌కుండా రావాలి*

చాలా స‌చివాల‌యాల్లో వాలంటీర్ల హాజ‌రు శాతం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంద‌రూ విధిగా హాజ‌ర‌య్యేలా ప్ర‌త్యేక స‌ర్క్యుల‌ర్ మెమో జారీ చేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ సీఈవోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అలాగే ఎన‌ర్జీ అసిస్టెంట్స్ కూడా స‌రిగా హాజ‌రు కావ‌టం లేద‌ని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌కు సూచించారు.

*కార్యాల‌యాల చిరునామా బోర్డులు మార్చాలి*

జిల్లాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటైన క్ర‌మంలో వివిధ విభాగాల‌కు సంబంధించి చిరునామా బోర్డులు త‌ప్పకుండా మార్పు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాకు అందించాల్సిన స‌మాచారం ఉంటే త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని చెప్పారు. నీతి ఆయోగ్ సూచిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సీపీవో కార్యాల‌యానికి త్వ‌రిత‌గ‌తిన అంద‌జేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు.

స‌మావేశంలో డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Resolve to satisfy the people * * Care should be taken not to repeat the complaints * District Collector A. Suryakumari reviewing the response