SCs should be served by every government department and should spend a percentage of the funds allotted to SCs to them. District Collector Mrs. Suryakumari at the sub plan meeting
Publish Date : 17/11/2021
ప్రతి ప్రభుత్వ శాఖ ద్వారా ఎస్.సి.లకు సేవలు అందాలి
ఎస్.సి.లకు నిర్దేశించిన నిధులు శతశాతం వారికి ఖర్చుచేయాలి
ఎస్.సి. సబ్ ప్లాన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 16; జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ ద్వారా షెడ్యూల్డు కులాల వారికి తమ శాఖకు సంబంధించి ఏదో విధమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వద్ద ఎస్.సి.లకు రాయితీలు, పథకాలు అందించేందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు వుంటే ఆయా పథకాలు అందించాలని లేని పక్షంలో ఎస్.సి.లలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వారి సామర్ధ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఆయా శాఖలకు నిధులు వెంటనే కేటాయింపు జరగనప్పటికీ ఎస్.సి. లబ్దిదారులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేసి వుంచుకొని బడ్జెట్ కేటాయింపులు జరిగిన వెంటనే వారికి ఆయా పథకాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో షెడ్యూల్డు కులాల సబ్‌ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధిపతులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలు ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎస్.సి. ఉప ప్రణాళిక లక్ష్యాలు ఏమేరకు చేరుకున్నాయనే అంశంపై సమగ్రంగా సమీక్షించారు. శాఖల వారీగా, ఆయా స్కీముల వారీగా లక్ష్యాల సాధనపై కలెక్టర్ సమీక్షిస్తూ ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు.
జిల్లాలో షెడ్యూల్డు కులాల వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో రేషన్ షాపుల డీలర్‌షిప్ ఆ వర్గం వారికే కేటాయించాలని చెప్పారు. ఉద్యానశాఖ, ఏపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఉద్యానపంటలు పండించే రైతులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ఎస్.సి. మహిళా గ్రూపులకు బ్యాంకుల ద్వారా యూనిట్ల ఏర్పాటుకు రుణాల మంజూరులో లీడ్ బ్యాంకు మేనేజర్ తోడ్పాటు అందించాలని కోరారు. జలకళ పథకంలో అర్హులైన ఎస్.సి. రైతులను గుర్తించి వారి పొలాల్లో బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే వాటిని మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని డ్వామా పి.డి.కి సూచించారు. జిల్లాలో కొత్తగా పట్టణ ప్రాంతాల్లో 117 ఎస్.సి. మహిళా స్వయంశక్తి గ్రూపులు ఏర్పాటు చేశామని మెప్మా పిడి సుధాకర్ వివరించారు. ఎస్.సి. మహిళా గ్రూపులన్నీ బ్యాంకు లింకేజీ రుణాలు పొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు 300 టన్నుల పశుదాణా అందుబాటులో వుందనే విషయాన్నిప్రత్యేక అధికారులు మండలాల్లో పర్యటించినపుడు రైతులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేవించారు. జిల్లాలో సంక్షేమ శాఖల పనితీరును ఇకపై ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్ధులు సాధించిన మార్కులు, ర్యాంకుల ఆధారంగా మదింపు చేస్తామని కలెక్టర్ స్పష్టంచేశారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. పి.సునీల్ రాజ్‌కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
