Service to dumb creatures … Service to the Divine Efforts should be made to enhance animal wealth District Collector A. Suryakumari
Publish Date : 02/05/2022
మూగజీవాలకు సేవ… భగవంతుని సేవ
పశు సంపదను వృద్దికి కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఘనంగా ప్రపంచ వెటర్నరీ దినోత్సవం
విజయనగరం, ఏప్రెల్ 30 ః జిల్లాలో పశు సంపదను వృద్ది చేసేందుకు, పశువైద్యులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. పశువైద్యం ఎంతో ఘనమని ఆమె పేర్కొన్నారు. స్థానిక లీపేరడైజ్ కల్యాణమండపంలో, ప్రపంచ వెటర్నరీ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, పశువైద్యం ఎంతో గౌరవప్రదమైన గొప్ప వృత్తి అని అన్నారు. మూగజీవాలకు సేవ చేయడం భగవంతుని సేవతో సమానమని పేర్కొన్నారు. పశువులకు, జీవాలకు వైద్యం చేయడంతోపాటు, పశువైద్య శాస్త్రాన్ని అభ్యసించడం కూడా చాలా కష్టమని అన్నారు. సమాజంలో పశువైద్యుల పాత్ర ఎంతో కీలకమని, పశువులు, ఇతర జీవాలనుంచి మానవులకు సంక్రమించే సుమారు 200 రకాల వ్యాధులను నియంత్రించాల్సిన బాధ్యత వీరిపై ఉందని అన్నారు. ఉద్యోగాల్లో సహజంగా వచ్చే నిర్లిప్తతను విడనాడి, మూగజీవాల ఆరోగ్యంపట్ల మరింత శ్రద్ద వహించాలని కోరారు. తీవ్రమైన వ్యాధులు విజృంభించే సమయంలో మాత్రమే కాకుండా, ఇతర సమయంలో కూడా జునోసిస్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, పశువుల సంఖ్యను వాస్తవికంగా పెంచేందుకు కృషి చేయాలని, ఒకరివద్దనుంచి మరొకరికి పశువుల మార్పిడి కాకుండా, కొత్త జీవాలను సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పశుసంపదను పెంచితే, రైతుల ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా, పరోక్షంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్టేనని అన్నారు. దీనికి పలమనేరు ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రస్తుతం గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు ఎంతో లాభసాటిగా నడుస్తున్నాయని కలెక్టర్ చెప్పారు.
పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం ఏప్రెల్ నెలలో చివరి శనివారం ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో శువైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి, ఈ సందర్భంగా అవార్డును ప్రదానం చేయడం జరుగుతోందని తెలిపారు. పశు సంపదను వృద్ది చేయడం, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, పశువుల నుంచి వివిధ రకాల వ్యాధులు మానవులకు సోకకుండా నిరోధించాల్సిన బాధ్యత కూడా పశువైద్యులపై ఉందని చెప్పారు. జిల్లా పశుసంవర్థక శాఖ, అందిస్తున్న సేవల పరంగా, రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉందని తెలిపారు.
పశు మత్స్య దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గరివిడి పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ చెంగల్వరాయుడు, డివిజనల్ డిప్యుటీ డైరెక్టర్లు డాక్టర్ రామచంద్ర, డాక్టర్ ఆర్.నీలయ్య, విటిసి డిడి డాక్కర్ భాస్కరరాజు, ఇంకా డాక్టర్ నరేష్, డాక్టర్ కృష్ణ, పలువురు ఏడిఏలు, పశు వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
