Services from family physician, wellness center or secretariat from August 15, measures to control fever should be taken, District Collector A. Suryakumari
Publish Date : 12/08/2022
ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్
వెల్‌నెస్ సెంటర్ లేదా సచివాలయం నుంచి సేవలు
జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఆగస్టు 10 ః ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్ (ఫ్యామిలీ డాక్టర్) సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు లేదా సచివాలయాలనుంచి ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు, వైద్యారోగ్య శాఖాధికారులతో తన ఛాంబర్‌లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, కోవిడ్ వేక్సినేషన్, వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీ మొదలగు అంశాలపై సమీక్షించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచీ ఫ్యామిలీ ఫిజీషయన్ సేవలను ప్రారంభించేందుకు పకడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆరోజు నుంచి సచివాలయాలు లేదా వెల్‌నెస్ సెంటర్లలో రోగులను పరీక్షించడానికి అవసరమైన ఫర్నీచర్, పరికరాలు, మందులు సిద్దం చేయాలన్నారు. వెల్‌నెస్ సెంటర్లు పూర్తికాని చోట, గ్రామస్తులకు అందుబాటులో ఉండే ఏదైనా ప్రభుత్వ భవనాన్ని గుర్తించాలన్నారు. పిహెచ్‌సిల్లో ఒక డాక్టర్ గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని, మరో డాక్టర్ అక్కడే ఉండి రోగులను చూస్తారని చెప్పారు. ప్రస్తుతానికి ప్రతీ గ్రామానికీ డాక్టర్ కనీసం నెలకు ఒక్కసారైనా వెళ్లేవిధంగా ప్రణాళికను రూపొందించాలని, ఆ తరువాత దీనిని నెలకు రెండుసార్లుకు పెంచాలని సూచించారు. ఉదయం రోగులను పరీక్షించడం, మధ్యాహ్నం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలల, హాస్టల్ పిల్లలను పరీక్షిస్తారని తెలిపారు. డాక్టర్ వస్తున్న విషయాన్ని ఆయా గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. అలాగే ఆ డాక్టర్ పేరు, ఫోన్ నెంబరును సచివాలయం లేదా వెల్‌నెస్ సెంటర్‌లో రాసి ఉంచాలని చెప్పారు. డాక్టర్లు రోగులను ఏకాంతంగా పరీక్షించేందుకు వీలుగా ప్రత్యేక గదిని కేటాయించాలని సూచించారు. రోగుల వివరాలను సంబంధిత యాప్‌లో పొందు పరచాలన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా 70 రకాల మందులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. వైద్య సేవలను అందించేందుకు గానూ 120 రకాల పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆరోగ్య గుర్తింపు కార్డును జారీ చేస్తారన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కేవలం వైద్యసేవలను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రజలకు తల్లిపాల ఆవస్యకత, కుటుంబ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత, వేక్సినేషన్, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు మందుల పిచికారీ, ఫాగింగ్, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కోవిడ్ వేక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వేక్సిన్ వేయాలని, కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఫీవర్ సర్వేని త్వరగా పూర్తి చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖలో చేపట్టిన ఖాళీల భర్తీని పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు.
సమావేశంలో జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, డిపిఓ ఇందిరా రమణ, ఇన్‌ఛార్జి డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ రాణీ సంయుక్త, డిసిహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మణ్, కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కె.సీతారామరాజు, జిల్లా మలేరియా అధికారి తులసి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
