Close

* Shilparamam into use from June 1 * * Collector Suryakumari inspects development programs and facilities

Publish Date : 25/05/2022

*జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం*
*అభివృద్ధి కార్యక్రమాలను, వసతులను పరిశీలించిన కలెక్టర్ సూర్యకుమారి
*మరింత సుందరీకరణగా మలచాలని అధికారులకు ఆదేశాలు
విజయనగరం, మే 24:- విజయనగరంలోని నల్ల చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం శిల్పారామాన్ని జూన్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పర్యాటక శాఖ, శిల్పారామం అధికారులను ఆదేశించారు. పచ్చని చెట్లు, నీటి కొలను, ఓపెన్ ఆడిటోరియం, సుందరమైన పార్కు ఆకట్టుకునేలా ఉన్నాయని.. వాటికి అదనంగా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసి మరింత సుందరీకరణగా మలచాలని సూచించారు. మంగళవారం సాయంత్రం పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, శిల్పారామం ఏవో రమణలతో కలిసి ఆమె పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. పలు సూచనలు అందజేశారు. నీటి కొలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, పిల్లలు ఆడుకునే విధంగా ఉయ్యాలలు, బల్లలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. జూన్ ఒకటో తారీఖు అట్టహాసంగా అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలు, మామిడి పళ్లు ప్రదర్శనలో పెట్టాలని సూచించారు.
పర్యాటకుల సౌకర్యార్థం తాగునీరు సదుపాయం కల్పించాలని, కూర్చునేందుకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంట్రీ ఫీజు వసూలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అలాగే పట్టణం నుంచి శిల్పారామం చేరుకునే రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఆమె వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, శిల్పారామం ఏవో రమణ, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.
* Shilparamam into use from June 1 * * Collector Suryakumari inspects development programs and facilities