Special attention should be given to building constructions, details of beneficiaries should be displayed in secretaries, review of response requests every Wednesday, State Chief Minister YS Jaganmohan Reddy in Spandana V.C.
Publish Date : 24/08/2022
భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
లబ్ధిదారుల వివరాలను సచివా లయాలలో ప్రదర్శించాలి
ప్రతి బుధవారం స్పందన వినతులు పై సమీక్షించాలి
స్పందన వి.సి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి
విజయనగరం, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్య0గా ప్రభుత్వ భవనాల నిర్మాణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, నాడు – నేడు కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ పథకాలకు నిధుల కొరత కూడా లేదని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు చెల్లింపులు జరిగాయని, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత చెల్లింపులు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలను సీరియస్ గా తీసుకొని కలెక్టర్లు కార్యక్రమలు పూర్తిచేయాలని సూచించారు. ఉపాధి హామీ, నాడు – నేడు, గృహ నిర్మాణం, వై.యస్.ఆర్.హెల్త్ క్లినిక్స్, జగనన్న భూహక్కు – భూరక్ష, స్పందన, భూసేకరణ తదితర అంశాలపై రాష్ట ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులకు వేతనదారులకు కనీస వేతనం రూ.240/-లు అందేలా కలెక్టర్లు చొరవ చూపాలని అన్నారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టే భవన నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ నిర్మాణ దశలలో ఉన్న భవన నిర్మాణాలకు ప్రాధాన్యతను ఇస్తూ లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. రాష్ట్రంలో 310 చోట్ల గ్రామ సచివాలయాలు గ్రౌండింగ్ కాలేదని,ఈ ప్రాంతాల్లో పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై కూడా కలెక్టర్లు దృష్టి సారించాలని, వెనుకంజలో ఉన్న జిల్లా కలెక్టర్లు మరింత ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్ లను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కాని గ్రామాలపై కలెక్టర్లు ఎప్పటికపుడు సమీక్షిస్తూ వాటిని పూర్తిచేసేలా చూడాలన్నారు. 2వ విడతలో నాడు – నేడు క్రింద చేపట్టిన పాఠశాలలు పూర్తికావాలని, కలెక్టర్లు ఈ విషయమై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. మొదటి విడతలో పూర్తిచేసిన పాఠశాలల్లో నిర్వహణా నిధులు సిద్ధంగా ఉన్నాయని వాటితో పాఠశాలల్లో మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం బాగుండేలా చూడాలని సూచించారు. ప్రతి పాఠశాల, ఆసుపత్రిలో ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాట్లుచేయాలన్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి, ప్రారంభం కాని చోట్ల ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. రీసర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేసి, జగనన్నహక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా,డివిజన్,మండల స్థాయిలో నిర్వహించే స్పందనలో కలెక్టర్లు,జేసీలు, రెవిన్యూ డివిజనల్, జిల్లా, మండల అధికారులు విధిగా హాజరుకావాలని అన్నారు. స్పందనకు వచ్చే అర్జీదారులకు తృప్తిపరిచేలా శాఖాధిపతులు ఇచ్చే సమాధానాలు ఉండాలని, నిర్ణీత గడువులోగా అర్జీదారులకు వివరాలు అందజేయాలని సూచించారు. ప్రతి బుధవారం స్పందన పెండింగ్ ఆర్జీలపై కలెక్టర్లు సమీక్షిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 25న నేతన్న నేస్తం, వచ్చే నెల 22న వై.ఎస్.ఆర్.చేయూత లబ్ధిదారులకు అందించనున్నామని, లబ్ధిదారుల వివరాలు తిలకించేలా సచివలయాలలో ప్రదర్శించాలన్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో దిశా యాప్ ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు రమణ మూర్తి, జిల్లా
విద్యాశాఖాధికారి వెంకటేశ్వర రావు, భూ రికార్డులు మరియు సర్వే శాఖ సహాయ సంచాలకులు త్రివిక్రమ రావు, కె.ఆర్.సి ఉప కలెక్టర్ సూర్యనారాయణ, టీడీకో ఈఈ జ్యోతి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
