Special Drive to identify street children, Childline 1098 should be informed, District Collector A. Suryakumari
Publish Date : 18/12/2021
వీధిబాలలను గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్
చైల్డ్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, డిసెంబరు 17 ః జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించి, వీధిబాలలను గుర్తించి, వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. సిఐఎస్ఎస్ (చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిట్యుయేషన్స్) స్టేక్ హోల్డర్స్ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం జరిగింది.
జిల్లాలో వీధిబాలల పరిస్థితి, వారికి పునరావాస కేంద్రాలు, బాలకార్మికుల స్థితిగతులు, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వీదిబాలలను ఎక్కడైనా గుర్తిస్తే, నేచర్ చైల్డ్‌లైన్ నెంబరు 1098 కాల్సెంట్కు సమాచారాన్ని అందించాలని కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వీధిబాలలు ఎక్కడా ఉండకుండా చూడాలని ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వీధిబాలలందరినీ పునరావాస కేంద్రాలకు పంపించాలని సూచించారు. ముఖ్యంగా ర్వైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, పెద్దపెద్ద ఆలయాలు, బీచ్‌ల్లో గాలించి, వీధిబాలలను గుర్తించాలని సూచించారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించి, వారి ఆరోగ్యం, విద్య తదితర అంశాలపట్ల దృష్టి పెట్టాలని ఆదేశించారు.
బాల కార్మికులను గుర్తించి, పునరావాస పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. దీనికోసం హొటళ్లు, ఫ్యాక్టరీలు, షాపులను తనిఖీ చేయాలన్నారు. వ్యవసాయరంగంలో కూడా బాలకార్మికులు ఉండే అవకాశం ఉందని, దానిపైనా దృష్టిపెట్టాలని చెప్పారు. పోలీసుశాఖ నుంచి సిసి కెమేరా పుటేజీలను తీసుకొని, వాటిని పరిశీలించి బాలకార్మికులు, వీధిబాలలను గుర్తించాలని సూచించారు. బాలికలను ఎక్కడైనా గుర్తిస్తే వారిని, కస్తూరిభాగాంధీ బాలికల పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, వీధిబాలలను గుర్తించేందుకు పలు సూచనలు చేశారు. కొంతమంది అనాధ పిల్లల సంరక్షణ బాధ్యతలు స్వీకరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ముందుకు వచ్చినట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, సమగ్ర శిక్ష ఏపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, ఎన్‌సిఎల్‌పి పిడి ఆర్.రమాదేవి, బాలల హక్కుల కమిటీ ఛైర్పర్సన్ జి.హిమబిందు, డిడబ్ల్యూసిడిఏ ఏపిడి పి.లావణ్య, డిసిపిఓ బిహెచ్ లక్ష్మి, నేచర్ చైల్డ్‌లైన్ కౌన్సిలర్ జికె దుర్గ, డిసిఆర్బి ఎస్ఐ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
