Street children should be protected, District Collector Surya Kumari
Publish Date : 10/08/2022
వీధి బాలలను సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, ఆగస్టు 10:: బాలలు పాఠశాలలు లేదా గృహాలలో ఉండాలని, వీధుల్లో ఉండకూడదని, అలా ఉండేవారిని సంరక్షణా గృహాలలో ఉంచి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. అదే విధంగా బాల కార్మికులను గుర్తించాలని, బాల్య వివాహాలను అడ్డుకోవాలని అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో బాలల సంక్షేమ సమితి త్రై మాసిక సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల న్యాయ రక్షణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. జిల్లాలో తప్పిపోయిన బాల బాలికల పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్, స్వచ్ఛంద సంస్థలు సహకారంతో బాలల సంక్షేమ సమితి వసతి గృహాలలో బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాలల పట్ల అసభ్య ప్రవర్తన తదితర అంశాల పై బాలలకు అవగాహన కల్పించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సహకారాన్ని అందించాలన్నారు.
బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ హిమ బిందు మాట్లాడుతూ జిల్లాలో గత మూడు నెలల్లో 20 బాల్య వివాహాలు జరిగాయని, 18 ఫోక్స్లో కేసు లు నమోదయ్యాయని, 26 కిడ్నప్, పారిపోయిన కేసులు నమోద య్యాయని తెలిపారు. 140 మంది బాలలను చైల్డ్ కేర్ సంస్థలలో చేర్చడం జరిగిందన్నారు. 18 ఏళ్ల లోపు బాల బాలికల హక్కులకు భంగం కలిగినట్లు ఎక్కడైనా గుర్తించినా, బాల కార్మికులను పనిలో పెట్టుకున్నా, బాల్య వివాహాలు జరుపుతున్న 94906 22526 ఫోన్ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో బాలల న్యాయ రక్షణ నోడల్ అధికారి శరత్, బాలల సంక్షేమ సమితి సభ్యులు చిట్టిబాబు, సుధారాణి, భవాని, కార్మిక శాఖ, దిశ, రైల్వే, నేర విభాగం పోలీస్, దివ్యంగుల శాఖ, వైద్య ఆరోగ్య , ఐ.సి.డి.ఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
