Strong measures to prevent road accidents *Identify black spots and install warning boards *District Collector Suryakumari in road safety committee meeting
Publish Date : 07/09/2022
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
*బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయండి
*రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
*హైవేకి అనుసంధానం అవుతున్న అప్రోచ్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఉండాలి ః ఎస్పీ
విజయనగరం, సెప్టెంబర్ 02 ః జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కాలయాపన కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఒక్క వ్యక్తి కూడా చనిపోడానికి వీలులేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకొనే ప్రాంతాలకు సమీపంలో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని సంబంధిత విభాగ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు, ఆసుపత్రికి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్.ఐ.సి. కేంద్రంగా సేవలందించే ఐరాడ్ యాప్‌లో కూడా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
జాతీయ రహదార్లు, రాష్ట్ర, ఆర్&బి, మున్సిపాలిటీల పరిధిలో ఉండే రోడ్లలో గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణ, రోడ్ల మరమ్మతుల విషయంలో ఇతర చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. జాయింట్ తనిఖీలు చేపట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ప్రయాణికులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని, ముఖ్యంగా మహిళల్లో దీనిపై పూర్తిగా అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చూడాలి ః ఎస్పీ
జాతీయ రహదారికి అనుసంధానమయ్యే అప్రోచ్ రోడ్లలో తప్పకుండా స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ పేర్కొన్నారు. జిల్లాలో చాలా చోట్ల అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేవని ఆయా చోట్ల పర్యటించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్&బి అధికారులకు సూచించారు. ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ప్రమాదాలను నివారించివచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వి. సుందర్, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, విజయనగరం మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, డీసీహెహ్ఎస్ నాగభూషణరావు, డీఎస్పీ మోహన్ రావు, ఐరాడ్ విభాగ జిల్లా మేనేజర్ శ్రీధర్, ట్రాన్స్‌పోర్టు అధికారులు, జాతీయ రహదారి విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
