Suggest alternative crops, immediate supply of seeds, District Collector A. Suryakumari, inspection of Thotapalli canals, talk to farmers and inquire about problems, Kella RBK, spot inspection of school
Publish Date : 07/09/2022
ప్రత్యామ్నాయ పంటలను సూచించండి
వెంటనే విత్తనాలు సరఫరా చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
తోటపల్లి కాలువల పరిశీలన
రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా
కెల్ల ఆర్‌బికె, పాఠశాల ఆకస్మిక తనిఖీ
గుర్ల, గరివిడి, (విజయనగరం), సెప్టెంబరు 06 ః రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని, వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. సాగునీటి ఎద్దడి నెలకొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. సాగునీటి కాలువలను, చెరువులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వరిపంటకు బదులు అపరాలను సాగుచేయాలని సూచించారు.
గుర్ల, గరివిడి మండలాల్లో కలెక్టర్ సూర్యకుమారి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. గుర్ల మండలం గూడెం వద్దనున్న తోటపల్లి డిస్ట్రిబ్యూషన్ కెనాల్‌ను కలెక్టర్ ముందుగా పరిశీలించారు. ఈ కెనాల్ ద్వారా సుమారు 6వేల ఎకరాలకు నీరు అందుతుందని, కెనాల్‌లో పూడికలు, పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయిన కారణంగా నీరు వెళ్లే పరిస్థితి లేదని, తోటపల్లి ఇఇ రామచంద్రరావు వివరించారు. అనంతరం పెనుబర్తి వద్ద తోటపల్లి ప్రదాన కుడి కాలువను కలెక్టర్ సందర్శించారు. ఈ కాలువలో 96.5 కిలోమీటర్లు వరకు మాత్రమే నీరు వచ్చిందని, పూడికలు, పిచ్చిమొక్కల కారణంగా దిగువకు నీరు రావడం లేదని ఇఇ తెలిపారు. కాలువల నిర్వహణకు దాదాపు 8 ఏళ్లుగా నిధులు రావడం లేదని, లష్కర్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. ఫలితంగా గుర్ల, గరివిడి, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలకు పూర్తిగా, చీపురుపల్లి మండలానికి పాక్షికంగా సాగునీటి కొరత ఏర్పడిందని ఇఇ వివరించారు.
గరివిడి మండలం శేరిపేట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ముందుగా గ్రామంవద్ద తోటపల్లి కాలువపై నిర్మించిన సైపూన్‌ను పరిశీలించారు. అనంతరం పంటపొలాలను వీక్షించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. తోటపల్లి కాలువ నుంచి నీరు రాకపోవడంతో, గ్రామంలో ఉబాలు జరగలేదని, నారు ఎండిపోతోందని రైతులు చెప్పారు. కాలువలను బాగుచేయించి, వచ్చే ఏడాదికైనా కాలువల ద్వారా సాగునీరు వచ్చేలా చూడాలని రైతులు కోరారు. తమకు సబ్సిడీపై పెసలు, మినప విత్తనాలను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. తోటపల్లి ప్రాజెక్టు పైన తగినంత వర్షపాతం లేదని, అందువల్ల సాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. ఈ సమస్యను ప్రభుత్వానికి నివేదించడంతోపాటు, ఉపాధిహామీ పథకం ద్వారా కాలువల నిర్వహణకు ప్రయత్నం చేస్తామని, వచ్చే ఏడాది నాటికి ఈ సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా, వరికి బదులు అపరాలు లాంటి తక్కువ నీటి అవసరం గల, ప్రత్యామ్నయ పంటల సాగును చేపట్టాలని సూచించారు. రైతుల విజ్ఞప్తి మేరకు మినప, నల్ల పెసర విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావును, ఏఓ సంగీతను ఆదేశించారు. నీటి ఎద్దడి నెలకొన్ని ప్రాంతాలను తక్షణమే సర్వే చేసి, అవసరమైన విత్తనాలను రైతులకు అందించాలని కలెక్టర్ సూచించారు.
నానో యూరియాను ప్రోత్సహించండి
గుర్ల మండలం కెల్ల రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, గ్రామంలోని పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎరువుల సరఫరా, లభ్యతపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, సరిపడిన ఎరువులను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించి, దాని వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో ఇ-క్రాప్ నమోదు, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్, ఇకెవైసి, భూముల రీసర్వే, ప్రకృతి సేద్యంపై ఆరా తీశారు. పశువ్యాధులపై ప్రశ్నించారు. వ్యాధులు ప్రభలకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. నవంబరు నాటికి రైతుభరోసా కేంద్రం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసిన కలెక్టర్
కెల్ల జిల్లాపరిషత్ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆహార పదార్ధాలను స్వయంగా ఆమె రుచి చూశారు. మెనూ, పిల్లల సంఖ్యపై ప్రశ్నించారు. కిచెన్‌షెడ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతికి వెళ్లి, విద్యార్థులతో మాట్లాడారు. వారిచేత పాఠాలను చదివించి, పరీక్షించారు. బాలికలందరినీ సఖి గ్రూపుల్లో చేర్చాలని సూచించారు. విద్యార్థులకు చదువుతోపాటు, కెరీర్ గైడెన్స్ నిర్వహించాలని, వారు లక్ష్యాన్ని సాధించే మార్గాలను సూచించాలని, హెడ్‌మాష్టర్ పైడితల్లిని ఆదేశించారు. ఈ పర్యటనలో గుర్ల తాశీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ బి.కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
