* Take Re-Survey Seriously * * Everyone should reach the set targets in a row * J.C. Mayur Ashok at DTs, Surveyors Training Course
Publish Date : 02/05/2022
*రీ-సర్వేను సీరియస్ గా తీసుకోండి*
*గడువులోగా నిర్ణీత లక్ష్యాలను అందరూ చేరుకోవాలి
*డీటీలు, సర్వేయర్ల శిక్షణా సదస్సులో జేసీ మయూర్ అశోక్
విజయనగరం, ఏప్రిల్ 30 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ- సర్వే ప్రక్రియను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని, పూర్తి ప్రక్రియపై సంబంధిత అధికారులందరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లకు సర్వే విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఒక్క రోజు శిక్షణా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలై, రీ సర్వే ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే స్పందించి సున్నితంగా పరిష్కరించాలని, పెద్దది అయ్యేదాకా కాలయాపన చేయొద్దని హితవు పలికారు.
నిబంధనలను అనుసరించి నిర్ణీత గడువులోగా జిల్లాలో గుర్తించిన 900 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను ముగించాలని అధికారులకు నిర్దేశించారు. కాల పరిమితి 49 రోజుల్లోగా గుర్తించిన గ్రామాల్లో రీ సర్వేను సజావుగా పూర్తి చేయాలని ఆలస్యం చేయరాదని హెచ్చరించారు. భూములను రీ సర్వే చేసి త్వరితగతిన ఎల్.పి.ఎంలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సర్వే విభాగపు అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. అన్ని మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి రీ సర్వే ప్రక్రియను శతశాతం విజయవంతంగా ముగించాలని జేసీ సూచించారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన క్రమంలో సంబంధిత అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని, ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, సర్వే విభాగం సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, ఎఫ్.ఎస్.వో. నూకరాజు, సర్వే విభాగపు ఇతర అధికారులు, వివిధ మండలాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
