Tenth class examinations should be conducted as a bandwagon, Education Minister Botsa Satyanarayana instructed the District Collectors, video conferencing with the Collectors and DEOs.
Publish Date : 22/04/2022
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు
కలెక్టర్‌లు, డి.ఇ.ఓ.లతో వీడియో కాన్ఫరెన్స్
విజయనగరం, ఏప్రిల్ 21 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు తగిన విధంగా సన్నద్ధత వుండాలన్నారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా పరీక్షలకు దూరప్రాంతాల నుంచి హాజరయ్యే విద్యార్దులకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌తో కలసి గురువారం జిల్లా కలెక్టర్‌లు, పోలీసు, విద్యాశాఖ అధికారులతో ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా పదో తరగతి పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భం మంత్రి మాట్లాడుతూ పరీక్షలు జరిగే సమయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులకు తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాలను కల్పించాలన్నారు.
జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీచేసి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు చేరుకొనేందుకు వీలుగా తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. మే 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఒక్కో గదిలో కోవిడ్‌ను దృష్టిలో వుంచుకొని 16 మంది విద్యార్ధులు మాత్రమే కూర్చొనేలా చర్యలు చేపట్టామన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో మొత్తం 29,561 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, వీరికోసం 181 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.ఎం.జయశ్రీ కూడా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
