The dream of middle class people realized, the allotment of plots for smart township layouts in Jaganna, the dream of common people has come true: ZP Chairman Majji Srinivasa Rao, for the first time in the state: District Collector Suryakumari, within a year we will give it to VMRDA Chairman.
Publish Date : 14/09/2022
నెరవేరిన మధ్యతరగతి ప్రజల కల
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్ల ప్లాట్లు కేటాయింపు
సామాన్యుల కల నెరవేరింది ః జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు,
రాష్ట్రంలోనే తొలిసారి ః జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
ఏడాదిలోగా అప్పగిస్తాం ః విఎంఆర్‌డిఏ ఛైర్‌పర్సన్ విజయనిర్మల
విజయనగరం, సెప్టెంబరు 13 ః మధ్యతరగతి ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యింది. ఇళ్ల స్థలాల కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్న వారి ఆశను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చింది. అతితక్కువ ధరకే అత్యంత విలువైన ఇంటి స్థలాలు వారి సొంతమయ్యాయి. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో ఎంఐజి ప్లాట్లను, కంప్యూటర్ లాటరీ విధానంలో లబ్దిదారులకు ప్లాట్ నంబర్లను కేటాయించారు. విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ది సంస్థ (విఎంఆర్‌డిఏ) ఆధ్వర్యంలో, కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 133 మందికి ఎంఐజి ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలను అందజేశారు.
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమం క్రింద నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి రఘుమండ గ్రామం వద్ద 287 ప్లాట్లను, గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి జియ్యన్నవలస వద్ద 152, మొత్తం 439 ప్లాట్లతో రెండు లే అవుట్లను విఎంఆర్‌డిఏ రూపొందించింది. ప్లాటు విస్తీర్ణం 240 చదరపు గజాలు, 200 చదరపు గజాలు, 150 చదరపు గజాల విస్తీర్ణంలో 3 విభాగాలుగా ప్లాట్లను రూపొందించారు. రఘుమండ లేఅవుట్‌లోని స్థలాల కోసం 264 మంది, జియ్యన్నవలస లేఅవుట్ స్థలాల కోసం 113 మంది దరఖాస్తు చేసుకున్నారు. రఘుమండ లేఅవుట్‌లో చదరపు గజం ధర రూ.6,500, జియ్యన్నవలస లేఅవుట్‌లో ధర రూ.7,500 గా విఎంఆర్‌డిఏ నిర్ణయించింది. ఈ స్థలాలకు ధరఖాస్తు చేసుకొని, ముందుగా 10 శాతం ధరను చెల్లించిన 145 మందిలో, దరఖాస్తుల పరిశీలన అనంతరం 133 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి అత్యంత పారదర్శకంగా, లబ్దదారుల సమక్షంలో కంప్యూటర్ లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. కేటగిరీల వారీగా, ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు, తరువాత పింఛనర్లకు, ఆ తరువాత సాధారణ పౌరులకు లాటరీ నిర్వహించి, ప్లాట్లను కేటాయించారు. రఘుమండ స్మార్ట్ టౌన్‌షిప్ లో 98 మంది, జియ్యన్నవలస స్మార్ట్ టౌన్ షిప్లో 35 మంది ప్లాట్లను పొందారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం స్థలాల్లో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, 5 శాతం విశ్రాంత ఉద్యోగులకు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్లాటు మొత్తం ఒకేసారి చెల్లించినవారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రఘుమండ లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విభాగంలో మొదటి 240 చదరపు గజాల స్థలాన్ని(ప్లాటు నెంబరు 230) కర్రి సూరిబాబు, పెన్షనర్ల విభాగంలో కెసిహెచ్ శివప్రసాదరావు (ప్లాటు నెంబరు 137) లాటరీ ద్వారా గెలుపొందారు. లాటరీలో ప్లాటు నంబర్లు కేటాయించబడ్డ మొదటి నలుగురు లబ్దిదారులకు, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విఎంఆర్‌డిఏ ఛైర్‌పర్సన్ ఎ. విజయనిర్మల, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, కేటాయింపు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చారని అన్నారు. ప్రతీ ఒక్కరికీ సొంత ఇళ్లు ఉండాలన్నది ముఖ్యమంత్ర లక్ష్యమన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. చిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు కూడా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమం క్రింద, అతి తక్కవ ధరకే అన్ని వసతులతో ఇళ్ల స్థలాలను అందజేయడం జరుగుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకొని, ముఖ్యమంత్రి కలను నెరవేర్చాలని ఛైర్మన్ కోరారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమం క్రింద రాష్ట్రంలోనే తొలి లేఅవుట్‌ను జిల్లాలో రూపొందించి, లబ్దిదారులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఎంతోమంది సామాన్య ప్రజలు మోసపోతున్న సంఘటనలు తరచూ తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు. చిరుద్యోగులు, సామాన్యులు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఎంఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో కూడిన ఇళ్ల స్థలాన్ని, తక్కువ ధరకే లబ్దిదారులకు అందజేయడం జరుగుతోందని చెప్పారు. ప్రజల డిమాండ్‌ను బట్టి ఇంకా పలు చోట్ల జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ రూపొందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖ సిటీకి దగ్గరగా ఉండటం వల్ల, అక్కడ హెచ్ఐజి ప్లాట్లు వేసే అవకాశాన్ని కల్పించాలని కలెక్టర్ సూచించారు.
విఎంఆర్‌డిఏ ఛైర్‌పర్సన్ విజయనిర్మల మాట్లాడుతూ, ఏడాదిలోగా లేఅవుట్లను అభివృద్ది చేసి, లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. విఎంఆర్‌డిఏ అంటేనే నమ్మకానికి మారుపేరు అని, అన్ని మౌలిక వసతులతో లేఅవుట్లను రూపొందిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందుబాటులోనే తక్కువ ధరకు తాము లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడ్డవారికి, చిరుద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు, విశ్రాంత ఉద్యోగులకు ఇదొక సువర్ణావకశామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సూర్యనారాయణ, సియుపి ప్రభాకర్, డిటిసిపి అడిషనల్ డైరెక్టర్ సునీత, విఎంఆర్‌డిఏ ఇతర అధికారులు, సిబ్బంది, డెంకాడ, బొండపల్లి తాశీల్దార్లు ఆదిలక్ష్మి, మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
