There should be a change in the attitude of girls, girls should stand on their own feet, District Collector A. Suryakumari, Awareness Conference for Women Police
Publish Date : 26/09/2022
బాలికల దృక్ఫథంలో మార్పు తేవాలి
ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
మహిళా పోలీసులకు అవగాహనా సదస్సు
విజయనగరం, సెప్టెంబరు 23 ః ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని, తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆకాంక్షించారు. బాలికల్లో చైతన్యం కల్పించడం ద్వారా, ఇందుకు మహిళా పోలీసులు కృషి చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడం, ప్రధమ చికిత్సను అందించడం, పోలీసు యాప్స్, రక్త హీనత నివారణా చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, కెరీర్ కౌన్సిలింగ్, సఖి కార్యక్రమం తదితర అంశాలపై, మహిళా పోలీసులకు రెవెన్యూ డివిజన్ల వారీగా శుక్రవారం అవగాహనా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు.
విజయనగరం డివిజన్ సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసుల పనితీరును అభినందించారు. ప్రస్తుతం గ్రామాల్లో మహిళా పోలీసుల పాత్ర చాలా కీలకంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాల్లో భార్యాభర్తా ఇద్దరూ ఉద్యోగాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు కూడా బాగా చదువుకొని, ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిర పడాలని సూచించారు. దీనికోసం ఆడపిల్లల దృక్ఫథంలో మార్పు రావాలని, దీనికోసం మహిళా పోలీసులంతా కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు తాము లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాకుండా, దానిని చేరుకోనే మార్గాలను కూడా తెలుసుకొనేందుకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. వివిధ రకాల ఆరోగ్య, మానసిక సమస్యల పరిష్కారానికి యోగా ఒక పరిష్కారమని సూచించారు. సఖి గ్రూపులను మరింత చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలవల్ల కలిగే నష్టాలు, శారీక పరిశుభ్రత, మహిళలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు, అవి రాకుండా తీసుకోవాల్సిన నివారణా చర్యలను వివరించాలని చెప్పారు.
ప్రస్తుత రోజుల్లో ఆర్థిక విషయాల పట్ల అవగాహన కూడా ప్రతీఒక్కరికీ అవసరమని అన్నారు. బ్యాంకుల కార్యకలాపాలు, రుణాలను తీసుకొనే విధానం, అధిక వడ్డీలకు ప్రయివేటు రుణాలు తీసుకోకుండా ఉండటం తదితర అంశాలను వివరించాలని సూచించారు. లోన్ యాప్స్ బారిన పడకుండా చూడాలని, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా చైతన్యం కల్గించాలని కోరారు. పిడుగుపాటు, అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షాకులు, గుండెపోటు లాంటి ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో సంపూర్ణంగా, మహిళా పోలీసులు అవగాహన కలిగిఉండాలని, గ్రామస్తులకు కూడా వాటిని వివరించాలని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని రకాల సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం వల్ల బాలికలు చిన్నవయసులోనే ప్రక్కదారి పడుతున్నారని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాటుసారా, కల్తీమద్యం, డ్రగ్స్ లాంటివి సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, నిరంతరం వాటిపట్ల నిఘా ఉంచాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి, ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజీ, మహిళా శిశు సంక్షేమాధికారి బి.శాంతకుమారి, డిఎల్‌డిఓ నిర్మల, రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ కెఆర్‌డి ప్రసాద్, జిల్లా యువజన సమన్వయాధికారి విక్రమాధిత్య, సచివాలయ సేవల జిల్లా సమన్వయకర్త అశోక్ తదితరులు పాల్గొన్నారు.
