Tolerance of sluggishness in housing, District Collector A. Suryakumari, Uttaravalli Engineering Assistant Suspension
Publish Date : 18/06/2022
గృహనిర్మాణంలో అలసత్వాన్ని సహించం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఉత్తరావల్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సస్పెన్షన్
విజయనగరం, జూన్ 17 ః గృహనిర్మాణ కార్యక్రమంలో అలసత్వాన్ని చూపిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టేజ్ అప్‌డేషన్‌లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న మెరకముడిదాం మండలం, ఉత్తరావల్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతికి సంబంధించి, డిఇలు, ఎఈలతో మండలాల వారీగా, స్టేజిలు వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల స్థితిగతులను, ఎఈల సమస్యలను ముందుగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గృహనిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దీనిలో నిర్లక్ష్యం చూపే సిబ్బందిని ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రానున్న 20 రోజులూ ఇళ్ల నిర్మాణానికి చాలా కీలకమని, ఆ తరువాత వర్షాలు ఎక్కువైతే పనులు ముందుకు సాగే అవకాశం ఉండదని అన్నారు. అందువల్ల అన్ని ఇళ్లకు ముందుగానే పునాదులు పూర్తిచేస్తే, కొంతవరకు ప్రయోజనం ఉంటుందన్నారు. మంజూరైన ప్రతీ ఇళ్లు కట్టితీరాల్సిందేనని, ఈ వారంలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని మండలాల్లో ఇళ్లు ప్రారంభించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లబ్దిదారులను చైతన్యపరిచి, తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాలని, అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమ్మెంటును ముందే తగినంత స్టాకు పెట్టుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో రోజువారీ ప్రగతిని మండలాల వారీగా పరిశీలించడం జరుగుతుందని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎప్పటికప్పుడు స్టేజ్ అప్‌డేషన్ చేయించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినచోట వెంటనే విద్యుత్, త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ప్రగతి నివేదికలు తయారు చేసేటప్పుడు తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్‌వి రమణమూర్తి, డిఈలు, ఎఈలు పాల్గొన్నారు.
