We are committed to the welfare of the farmer; Uttarandhra Vegetation by Sujala Sravanti; District Collector A. Suryakumari & District Parish Chairperson Majji Srinivasa Rao; Rs 183.24 crore farmer guarantee released to 2,44,303 families
Publish Date : 17/05/2022
రైతే సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం
జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు
2,44,303 కుటుంబాలకు రూ.183.24 కోట్లు రైతు భరోసా విడుదల
రాజాం, (విజయనగరం), మే 16 ః రైతే సమాజానికి వెన్నుముక అని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో, తమ ప్రభుత్వం ఒక్క విజయనగరం జిల్లాలోని రైతులకు ఈ మూడేళ్లలో సుమారు రూ.930 కోట్లు మేర లబ్ది చేకూర్చిందని పేర్కొన్నారు. నాలుగో విడత రైతు భరోసా పంపిణీ కార్యక్రమం, రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగింది. ముందుగా రైతు భరోసా ను ఏలూరు జిల్లా గణపవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజాంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో, జిల్లాలోని సుమారు 2,44,303 రైతు కుటుంబాలకు, రూ.183.24 కోట్ల విలువైన రైతు భరోసా చెక్కును అందజేశారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అంతకుముందు అతిధులు తిలకించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతులకు అడుగడుగునా అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆర్‌బికెలకు ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రత్యేక గుర్తింపు లభించడం, మన ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనమని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రప్పించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేసేందుకు ముఖ్యమంత్రి సంకల్పించారని చెప్పారు. దీనికి సంబంధించిన భూసేకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడే రాజాం ప్రాంతంలో సుమారు 75వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు. రాజాం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ది చేయడానికి కట్టుబడి ఉన్నామని ఛైర్మన్ స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆర్‌బికె సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేసి, రైతులకు సహాయ సహకారాలను అందించాలని, సాంకేతిక కారణాలతో రైతు భరోసా జమకాకపోతే, వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా రాజాం ప్రాంతంలో విరివిగా భూసార పరీక్షలను నిర్వహించి, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సూచించాలని చెప్పారు. ముఖ్యంగా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించి, భూమికి, మానవాళికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలను తీసుకొని, ఇక్కడి వ్యవసాయాన్ని మెరుగు పర్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. రైతే దేశానికి వెన్నుముక అన్న నానుడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి నిజం చేసి చూపారని కొనియాడారు.
రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు అధ్యక్షత వహించిన ఈ సభలో నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంఎల్‌సిలు డాక్టర్ సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, డిసిఎంఎస్ ఛైర్మన్ అవనాపు భావన, జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు గేదెల వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పద్మావతి, శ్రీకాకుళం జెడ్‌పి వైస్ ఛైర్మన్ జగన్‌మోహనరావు, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వ్యవసాయశాఖ జెడి వి.తారకరామారావు, పశు సంవర్థకశాఖ జెడి డాక్టర్ వైవి రమణ, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
